ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ డిజాస్టర్: పైకప్పు కూలిపోవడానికి కారణం ఏమిటి?

భారీ వర్షానికి ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్ 1 వద్ద పైకప్పులో ఓ భాగం కూలిపోవడంతో ఒకరు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  28 Jun 2024 12:14 PM IST
Delhi Airport, Terminal Roof Collapse, Canopy Collapse

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ డిజాస్టర్: పైకప్పు కూలిపోవడానికి కారణం ఏమిటి?

ఢిల్లీ: శుక్రవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్ 1 వద్ద పైకప్పులో ఓ భాగం కూలిపోవడంతో ఒకరు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. ఈ సంఘటన తర్వాత టెర్మినల్ 1 నుండి అన్ని నిష్క్రమణలను తదుపరి నోటీసు వచ్చేవరకు నిలిపివేసినట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. విమానాలు సజావుగా సాగేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు.

"ఢిల్లీ విమానాశ్రయం లోని టెర్మినల్ 1 డిపార్చర్లకు సంబంధించినది 15 ఏళ్ల నాటి నిర్మాణం. త్వరలోనే మూసివేయనున్నారు. ఇక్కడ చాలా తక్కువ సంఖ్యలో దేశీయ విమానాలను నడుపుతున్నాం" అని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ (DAIL) ప్రతినిధి NewsMeter కి చెప్పారు. శుక్రవారం ఉదయం, భారీ వర్షం కారణంగా, ఢిల్లీ విమానాశ్రయం టెర్మినల్ 1 పాత డిపార్చర్ ఫోర్కోర్ట్ వద్ద పైకప్పులో ఒక భాగం కూలిపోయింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మరణించగా, మరో ఆరుగురు గాయపడ్డారు. కానపీ కూలిపోయిందని.. పైకప్పు కూలిపోలేదని అధికారులు ధృవీకరించారు.

ఈ సంఘటన ఫలితంగా.. టెర్మినల్ 1 నుండి విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. భద్రతా చర్యగా చెక్-ఇన్ కౌంటర్లు కూడా మూసివేశారు. T1 నుండి ఇండిగో, స్పైస్‌జెట్ ద్వారా దేశీయ విమానాలను మాత్రమే నడుపుతున్నారు. T1, T2, T3.. మూడు టెర్మినల్‌ లు ఉన్న ఈ విమానాశ్రయం ప్రతిరోజూ 1,400 విమానాల రాకపోకలను నిర్వహిస్తుంది.

"T1 ను విస్తరించారు.. ఇది పాత డిపార్చర్స్ విభాగం. 15 ఏళ్ల నాటిది, దీన్ని త్వరలోనే మూసివేయాలని అనుకున్నారు. చాలా తక్కువ దేశీయ విమానాలకు సంబంధించి ఈ టర్మినల్ ద్వారా రాకపోకలు నిర్వహిస్తారు" అని న్యూస్‌మీటర్‌కి ఒక మూలం తెలిపింది. GMR ఎయిర్‌పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (GIL) నేతృత్వంలోని DIAL T1 విస్తరణ పనులను 2019లో చేపట్టింది. మార్చి 2024లో, ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ-స్థాయి ఇంటిగ్రేటెడ్ T1ని ప్రారంభించారు.

అన్ని విమానాశ్రయాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తాం:

ఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని పర్యవేక్షించినట్లు పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. మృతులకు రూ.20 లక్షలు, క్షతగాత్రులకు రూ.3 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. "2009లో ప్రారంభించిన 15 ఏళ్ల నాటి నిర్మాణం. ఢిల్లీ విమానాశ్రయం టెర్మినల్-1 పాత డిపార్చర్ ఫోర్‌కోర్టు వద్ద పైకప్పు లోని కొంత భాగం కూలిపోయింది. మంత్రిత్వ శాఖ నుండి, DGCA ఈ సంఘటనపై పర్యవేక్షణను తీసుకుంటుంది. అందుకు సంబంధించిన నివేదికను బయట పెడతాం. పాత నిర్మాణాలను గుర్తించి, అవసరమైన చర్యలు తీసుకోవడానికి మేము అన్ని విమానాశ్రయాలనూ పరిశీలిస్తాం, ”అని పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన భవనం ఇది కాదని.. అది మరోవైపు ఉందని తెలిపారు. ఇక్కడ కుప్పకూలిన భవనం పాత భవనమని.. 2009లో ప్రారంభించిందని ఆయన క్లారిటీ ఇచ్చారు.

విమానాల పరిస్థితి:

దేశీయ విమాన కార్యకలాపాలను మాత్రమే నిర్వహించే T1 వద్ద విమానాల బయలుదేరడం మధ్యాహ్నం 2 గంటల వరకు నిలిపివేశారు. విమానాశ్రయ ఆపరేటర్ తాత్కాలికంగా T2, T3కి కార్యకలాపాలను మార్చాలని చూస్తున్నారు.

ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల T1 వద్ద నిర్మాణాత్మకంగా దెబ్బతినడం వల్ల విమాన కార్యకలాపాలు ప్రభావితమవుతున్నాయని ఇండిగో ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. "ప్రయాణికులు టెర్మినల్‌లోకి ప్రవేశించలేని కారణంగా ఢిల్లీలో విమానాలను రద్దు చేస్తున్నారు. ఇప్పటికే టెర్మినల్ లోపల ఉన్న ప్రయాణీకులు విమానాలను ఎక్కగలరు, ప్రత్యామ్నాయాల గురించి సమాచారం అందిస్తాం" అని ఎయిర్‌లైన్ తెలిపింది. తదుపరి నోటీసు వచ్చే వరకు T1 కార్యకలాపాల కోసం పాక్షికంగా మూసివేయడంతో విమానాలు రద్దు చేస్తున్నామని X లో ఒక పోస్ట్‌లో SpiceJet తెలిపింది.

T1 విస్తరణ గురించి:

అరైవల్, డిపార్చర్ టెర్మినల్‌లను ఒక సమ్మిళిత నిర్మాణంగా ఏకీకృతం చేయడం వల్ల మొత్తం వైశాల్యం గణనీయంగా పెరుగుతుంది. ఇది 55,740 చదరపు మీటర్ల నుండి 206,950 చదరపు మీటర్లకు చేరుకుంది. ఈ విస్తరణ మునుపటి ప్రాంతం కంటే మూడు రెట్లు ఎక్కువ. 17 MPPA నుండి 40 MPPA వరకు సామర్థ్యాన్ని పెంచుతుంది.

ప్రయాణీకుల సౌకర్యాలు- అన్ని ప్రవేశ ద్వారాల వద్ద ముఖ గుర్తింపు వ్యవస్థ (DIGIYATRA), 20 ఆటోమేటెడ్ ట్రే రిట్రీవల్ సిస్టమ్ (ATRS), ఇండివిజువల్ క్యారియర్ సిస్టమ్ (ICS), 108 కామన్ యూసేజ్ సెల్ఫ్ సర్వీస్ (CUSS), 36 సెల్ఫ్ బ్యాగేజీ డ్రాప్‌తో సహా 100 చెక్-ఇన్ కౌంటర్లు (SBD) కియోస్క్‌లు.. మరిన్ని సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి.

Next Story