ఢిల్లీ ఎల్జీ సంచలన నిర్ణయం.. 223 మంది ఉద్యోగుల తొలగింపు
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
By Srikanth Gundamalla Published on 2 May 2024 1:08 PM ISTఢిల్లీ ఎల్జీ సంచలన నిర్ణయం.. 223 మంది ఉద్యోగుల తొలగింపు
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశ రాజధానిలో గవర్నర్, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం మధ్య విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన నిర్ణయం సంచలనాత్మకంగా మారింది. ఢిల్లీ మహిళా కమిషన్‌లో 223 మంది ఉద్యోగులను ఎల్జీ విధుల నుంచి తొలగించారు. ఈ మేరకు ఢిల్లీలోని లెఫ్ట్‌నెంట్ గవర్నర్ కార్యాలయం నుంచి గురువారం ఉత్తర్వులు వెలువడ్డాయి.
గత చైర్‌పర్సన్ స్వాతి మాలివాల్ నిబంధనలను ఉల్లంఘించి మరీ వీరిని నియమించారనీ ఉత్తర్వుల్లో ఎల్జీ కార్యాలయం పేర్కొంది. చట్ట ప్రకారం అయితే ఢిల్లీ మహిళా కమిషన్‌లో 40 పోస్టులను మాత్రమే కేటాయించారనీ.. కానీ స్వాతి మాలివాల్ ఎలాంటి అనుమతులు తీసుకోకుండా 223 కొత్త ఉద్యోగాలను సృష్టించినట్లు ఎల్జీ కార్యాలయం పేర్కొంది. అయితే.. ఒప్పంద నియామకాలు చేపట్టేందుకు కమిషన్‌కు అధికారం లేదని తెలిపింది. ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ప్రభుత్వంపై అదనపు భారం మోపే నిర్ణయాలను కమిషన్ తీసుకోకూడదని ఎల్జీ కార్యాయలం ఉత్తర్వుల్లో పేర్కొంది.
చట్ట విరుద్ధంగా విధుల్లోకి తీసుకున్న ఆ 223 మంది ఉద్యోగులనే తక్షణం తొలగిస్తున్నట్లు లెఫ్టినెంట్ కార్యాలయం ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా.. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా స్వాతి మాలివాల్ తొమ్మిదేళ్ల పాటు బాధ్యతలు నిర్వర్తించారు. ఈ ఏడాది జనవరిలో ఆమెను ఆప్ రాజ్యసభకు నామినేట్ చేసింది. ఆ తర్వాత కమిషన్ చైర్‌పర్సన్ పదవి ఖాలీగా ఉంది. ఢిల్లీలో ఎల్జీ వర్సెస్ ప్రభుత్వం అన్నట్లు పరిణామాలు కనిపిస్తున్నాయి. తాజాగా ఎల్జీ తీసుకున్న నిర్ణయంపై ఆప్, స్వాతి మాలివాల్ స్పందించలేదు.