Delhi: బేస్‌మెంట్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తోన్న కోచింగ్ సెంటర్లు సీజ్
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ చర్యలను చేపట్టింది.
By Srikanth Gundamalla Published on 29 July 2024 4:49 AM GMTDelhi: బేస్‌మెంట్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తోన్న కోచింగ్ సెంటర్లు సీజ్
ఢిల్లీలోని ఐఏఎస్ కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్‌లో అకస్మాత్తుగా వరదలు రావడంతో ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ చర్యలను చేపట్టింది. ఓల్డ్ రాజిందర్ నగర్ ప్రాంతంలోని 13 కోచింగ్ సెంటర్‌లను మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ) సీల్ చేసింది. సివిక్ బాడీకి చెందిన బృందం ఆదివారం అనేక కోచింగ్ సెంటర్లలో సోదాలు నిర్వహించింది. బేస్‌మెంట్‌లో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లను సీల్ చేసినట్లు ఢిల్లీ మేయర్ షెల్లీ ఒబెరాయ్ తెలిపారు.
ఈ మేరకు మేయర్ షెల్లీ ఒబెరాయ్ మాట్లాడుతూ.. "నిన్నటి విషాద సంఘటన తర్వాత బేస్‌మెంట్‌లో నిబంధనలను ఉల్లంఘిస్తున్న రాజిందర్ నగర్‌లోని అన్ని కోచింగ్ సెంటర్‌లను MCD సీల్ చేసిందని తెలిపారు. ఈ చర్యలు కొనసాగుతాయి. అవసరమైతే ఢిల్లీ అంతటా సోదాలు చేసి.. చర్యలు తీసుకుంటాం." అని మేయర్ ఒబెరాయ్ ఎక్స్‌లో రాసుకొచచారు.
బేస్‌మెంట్‌లను అనధికారంగా ఉపయోగిస్తూ సీజ్ అయిన కోచింగ్ సెంటర్లు ఇవే
1. IAS గురుకులం
2. చాహల్ అకాడమీ
3. ప్లూటస్ అకాడమీ
4. సాయి ట్రేడింగ్
5. IAS సేతు
6. టాపర్స్ అకాడమీ
7. దైనిక్ సంవాద్
8. సివిల్స్ డెయిలీ IAS
9. కెరీర్ పవర్
10. 99 నోట్స్
11. విద్యా గురు
12. గైడెన్స్ IAS
13. ఈజీ ఫర్ ఐఏఎస్
రావుస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్‌లో విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై విచారణ జరుగుతోందని అధికారులు వెల్లడించారు. దోషులగా తెలినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ ఘటన తర్వాత దేశ రాజధానిలో భనవ నిర్మాణాల్లో కనీస నిబంధనలు పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలువురు ఐఏఎస్ విద్యార్థులు ఆందోళనలు చేశారు.
కాగా.. శనివారం రాత్రి 7 గంటల సమయంలో రావుస్ స్టడీ సర్కిల్ బేస్‌మెంట్‌లోకి ఒక్కసారిగా వరద నీరు చేరింది. ఆ సమయంలో బేస్‌మెంట్‌లో ఉన్న లైబ్రరీలో దాదాపు 18 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో 15 మంది ఎలాగోలా బయటపడగా, ముగ్గురు మాత్రం నీటిలో మునిగిపోయారు. వారిని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. తెలంగాణలోని మంచిర్యాల జిల్లాకు చెందిన తాన్యా సోని(21), ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్‌కు చెందిన శ్రేయ యాదవ్(25), కేరళలోని ఎర్నాకుళంకు చెందిన నవీన్ దల్వైన్(29) వరదనీటిలో మునిగి మరణించారు.