రోహిణి కోర్టులో పేలుడు కేసు.. జైలులో శాస్త్రవేత్త ఆత్మహత్యాయత్నం
Defence Scientist Accused In Court Blast Attempts Suicide In Jail.ఢిల్లీలోని రోహిణి కోర్టులో బాంబు పేలుడు కేసులో
By తోట వంశీ కుమార్
ఢిల్లీలోని రోహిణి కోర్టులో బాంబు పేలుడు కేసులో డీఆర్‌డీవో సీనియర్ శాస్త్రవేత్త భరత్ భూషణ్ కటారియాను క్రైం బాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోలీస్ కస్టడిలో ఉన్న కటారియా ఆత్మహత్యాయత్నం చేశాడు. వాష్ రూమ్‌లోని హ్యాండ్ వాష్‌ను తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన పోలీసులు అతడిని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
శనివారం రాత్రి వాష్ రూమ్‌కు వెళ్లిన కటారియా అక్కడ ఉన్న లిక్విడ్ హ్యాండ్ వాష్‌ను తాగి అచేతనంగా పడిపోయాడు. కొద్దిసేపటి తరువాత అపస్మారస్థితిలో ఉన్న అతడిని గుర్తించిన పోలీసులు ఏమైందని ప్రశ్నంచగా.. కడుపు నొప్పి, వాంతులు అవుతున్నట్లు వెల్లడించాడు. వెంటనే అతడిని బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆస్పత్రికి తరలించారు. వారు ఎయిమ్స్‌కి తీసుకువెళ్లాలని సూచించడంతో అక్కడికి తీసుకువెళ్లారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగానే ఉందని అధికారులు తెలిపారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తరువాత విచారణను కొనసాగించనున్నట్లు తెలిపారు.
డిసెంబర్ 9వ తేదీన రోహిణి జిల్లా కోర్టులోని రూమ్ నెంబర్ 102లో తక్కువ స్థాయి తీవ్రతతో పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సీసీటీవీ పుటేజ్ ఆధారంగా బాంబు దాడికి పాల్పడింది డీఆర్‌డీవో శాస్త్రవేత్త అని గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఓ న్యాయవాదితో ఉన్న పాత కక్షల కారణంగా.. అతడిని చంపాలని భరత్ భూషణ్ కటారియా ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.