డీప్‌ఫేక్‌ బారిన పడ్డ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

డీప్‌ఫేక్‌ వీడియోలు ప్రస్తుతం దేశంలో కలవరం సృష్టిస్తున్నాయి.

By Srikanth Gundamalla  Published on  11 March 2024 11:49 AM IST
Deepfake video, uttar pradesh, cm yogi adityanath,

 డీప్‌ఫేక్‌ బారిన పడ్డ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

డీప్‌ఫేక్‌ వీడియోలు ప్రస్తుతం దేశంలో కలవరం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే డీప్‌ఫేక్‌ బారిన పడ్డ వారి లిస్ట్‌లో సినీ సెలబ్రిటీలతో పాటు ప్రధాని మోదీ కూడా ఉన్నారు. కొంతకాలం ముందు హీరోయిన్ రష్మిక మందన్న వీడియో అంటూ ఒక డీప్‌ఫేక్‌ వీడియో కలకలం సృష్టించింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. డీప్‌ఫేక్‌ వీడియోలపై జాగ్రత్తగా ఉండాలంటూ ఇండస్ట్రీ పెద్దలే కాదు.. పలువురు ప్రముఖులు చెప్పుకొచ్చారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతున్నట్లుగా కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చాయి. స్వయంగా ప్రధాని మోదీ కూడా డీప్‌ఫేక్‌పై స్పందించి ఖండించాల్సి వచ్చింది. తాజాగా డీప్‌ఫేక్‌ బారిన ఉత్తర్‌ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ పడ్డారు.

కొందరు ఆకతాయిలు ఇలాంటి డీప్‌ఫేక్ వీడియోలు తయారు చేసి నెట్టింట అప్‌లోడ్‌ చేస్తున్నారు. దీని వల్ల వారికి ఎలాంటి ఉపయోగం లేకపోయినా.. ఈ చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ డీప్‌ఫేక్‌ బారిన పడ్డారు. డయాబెటిస్‌ ఔషదానికి యోగి ప్రచారం చేస్తున్నట్లుగా ఉన్న వీడియో సోషల్‌ మీడియాలో డీప్‌ఫేక్‌ చేసి షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై సైబర్‌ క్రైం పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఐపీ అడ్రస్ ఆధారంగా వీడియో సృష్టించిన వారిని గుర్తించే పనిలో పడ్డారు.

ఇప్పటికే డీప్‌ఫేక్‌ వీడియోలపై కేంద్రం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. అయినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుంది. డీప్‌ఫేక్‌ వీడియోలు సృష్టించిన వారిపై చట్టపరమైన చర్యలుంటాయని కేంద్రం హెచ్చరించింది. కానీ.. కొందరు వ్యక్తులు మాత్రం ఈ నీచపు పనులను ఆపడం లేదు. అంతేకాదు.. డీప్‌ఫేక్‌ బారిన పడినవారు ఎవరైనా ఉంటే సైబర్‌ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలనీ.. ఆ తర్వాత పోలీసులు కూడా వారి ఫిర్యాదుపై వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

Next Story