కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ మహమ్మారి కారణంగా జనజీవనం అతలాకుతలం అయ్యింది. పలు దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఈ మహమ్మారిని కట్టడిని చేసేందుకు ఇప్పుడు ఉన్న ఒకే ఒక మార్గం వ్యాక్సినేషన్. ఈ మహమ్మారిని పూర్తిగా అంతం చేసేందుకు అందరికి వ్యాక్సినేషన్ ఇవ్వడమే ఏకైక మార్గం అని నిపుణులు చెబుతున్నారు. దీంతో అన్ని దేశాలు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేశాయి. ప్రజలందరికీ టీకాలు ఇస్తున్నాయి. పలు దేశాల్లో ఇప్పటికే 50 శాతానికిపైగా వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తి అయ్యింది. అక్కడ మాస్కులు తప్పనిసరి నిబంధనను ఎత్తివేశారు. ఎప్పటిలాగానే ప్రజలు వీధుల్లో విహరిస్తున్నారు.
అయితే.. చాలా మంది వ్యాక్సిన్‌లు తీసుకుంటుండగా.. అతికొద్ది మంది మాత్రం వ్యాక్సిన్‌ను తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. వారికి ఉన్న భయాలే అందుకు కారణం. ఇలాంటి తరుణంలో తాజాగా ఓ షాకింగ్ న్యూస్ ప్రచారంలోకి వచ్చింది. దాని ప్రకారం.. కరోనా వ్యాక్సిన్లు తీసుకున్న వారందరూ రెండేళ్లలో చనిపోతారట. ఈ వార్త వ్యాక్సిన్లు తీసుకున్న వారిని, వ్యాక్సిన్లు తీసుకోబోతున్న వారిని భయాందోళనకు గురి చేస్తోంది.
కరోనా వ్యాక్సిన్లు వేసుకున్న వారందరూ రెండేళ్లలో చనిపోతారని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టీకాల వల్ల కొత్త వేరియంట్లు పుడతాయని, టీకా తీసుకున్న వాళ్లకు ఎలాంటి చికిత్స ఉండదని, కచ్చితంగా చనిపోతారని నోబెల్ బహుమతి గ్రహీత లుక్ మాంటగ్రైర్ చెప్పినట్లు ప్రచారం చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇది గందరగోళానికి దారి తియ్యడంతో కేంద్రం స్పందించింది. దీనిపై క్లారిటీ ఇచ్చింది. టీకాలు తీసుకున్న వారంతా రెండేళ్లలో చనిపోతారనేది పూర్తి అవాస్తవం అని చెప్పింది. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వార్తలు నమ్మొద్దని స్పష్టం చేసింది.