కోవాగ్జిన్‌ తీసుకున్న వలంటీర్‌ మృతి.. స్పందించిన భార‌త్ బ‌యోటెక్‌

Death of Covaxin phase 3 volunteer not related to vaccine trial says Bharat Biotech.భార‌త్‌లో ఈ కోవాగ్జిన్‌ తీసుకున్న వలంటీర్‌ మృతి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Jan 2021 4:51 AM GMT
covaxin

భార‌త్‌లో ఈ నెల‌16 నుంచి వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. దేశంలో అతిపెద్ద వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను చేప‌ట్ట‌నున్నారు. అయితే.. ప్ర‌స్తుతం ఓ వార్త క‌ల‌క‌లం రేపుతోంది. భార‌త్ బ‌యోటెక్ రూపొందించిన కొవాగ్జిన్ వేయించుకున్న వ‌లంటీరు ఒక‌రు మృతి చెందారు. 45 ఏళ్ల వలంటీర్ వ్యాక్సిన్ తీసుకున్న 10 రోజుల త‌రువాత మృతి చెంద‌డం క‌ల‌క‌లం రేపింది. ఈ ఘ‌ట‌న డిసెంబ‌ర్ 21 జ‌రిగినా.. ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. దీంతో కోవాగ్జిన్ అత్య‌వ‌స‌ర వినియోగానికి ప్ర‌భుత్వం అనుమ‌తి ఇవ్వ‌డంపై అనుమానాలు వెల్లువెత్తున్నాయి. వ‌లంటీర్ మృతి చెందిన వార్త బయటకు రావడంతో ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. ట్రయల్స్ పూర్తి కాకుండానే వ్యాక్సిన్ కు ఎలా అనుమతులు ఇచ్చారని విమర్శలు చేస్తున్నారు.

భోపాల్‌కు చెందిన దీపక్ మ‌ర్వాయి భారత్ బయోటెక్ కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్‌ కోసం వలంటీర్‌గా రిజిస్టర్ చేసుకున్నారు. పీపుల్స్‌ మెడికల్‌ కాలేజీ అండ్‌ హస్పిటల్‌లో డిసెంబర్‌ 12న నిర్వహించిన క్లినికల్‌ ట్రయల్స్ నిర్వ‌హించారు. ఇందులో భాగంగా దీప‌క్ మ‌ర్వాయికి కూడా వ్యాక్సిన్ ఇచ్చారు. వ్యాక్సిన్‌ తీసుకుని ఇంటికొచ్చాక దీప‌క్‌.. కొంత ఇబ్బందిపడ్డారని, అనారోగ్య సమస్యలు తలెత్తాయని కుటుంబసభ్యులు తెలిపారు. డాక్ట‌ర్ వ‌ద్దకు వెలుదాం అని చెప్ప‌గా.. రెండు రోజుల్లో అంతా సర్దుకుంటుందని చెప్పిన‌ట్లు వారు తెలిపారు. ఆరోగ్య ప‌రిస్థితి క్షీణించ‌డంతో.. డిసెంబ‌ర్ 21 ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా మార్గ‌మ‌ధ్యంలో ప్రాణాలు కోల్పోయాడు. అయితే.. దీప‌క్ మ‌ర్వాయి విష ప్ర‌యోగం కార‌ణంగా చ‌నిపోయిన‌ట్లు అనుమానాలు ఉన్నాయ‌ని మధ్యప్రదేశ్‌ మెడికో లీగల్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ అశోక్‌ శర్మ చెప్పారు. అసలైన కారణమేంటో నిర్ధారించాల్సి ఉందన్నారు.

స్పందించిన భార‌త్ బ‌యోటెక్‌..

వలంటీర్‌ దీపక్‌ మృతిపై భారత్‌ బయోటెక్‌ సంస్థ స్పందించింది. ఫేజ్‌–3 ట్రయల్స్‌లో భాగంగా అతడి అంగీకారంతోనే వ్యాక్సిన్‌ ఇచ్చినట్లు తెలిపింది. వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత ఏడు రోజుల పాటు అతడిలో ఎలాంటి అనారోగ్య లక్షణాలు, దుష్ప్రభావాలు కనిపించలేదంది. పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడ‌ని పేర్కొంది. 9 రోజుల తర్వాత మరణించాడంటే అందుకు తమ వ్యాక్సిన్‌ కారణం కాదని ప్రాథమిక సమీక్షలో తేలినట్లు స్పష్టం చేసింది. అయితే, హ్యూమన్‌ ట్రయల్స్‌లో భాగంగా దీపక్‌ మర్వాయికి అసలైన కోవాగ్జిన్‌ ఇచ్చారా? లేక సాధారణ ఔషధం(ప్లాసిబో) ఇచ్చారా? అనేది ఇంకా నిర్ధారణ కాలేదు.


Next Story
Share it