అంబులెన్స్‌ లేక.. చెల్లి మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లిన అన్న

ఆస్పత్రిలో అంబులెన్స్‌లు అందుబాటులో లేవని చెప్పడంతో.. మృతదేహాన్ని బైక్‌పై తరలించారు.

By Srikanth Gundamalla  Published on  9 Nov 2023 3:45 PM IST
deadbody,  bike, no ambulance,  uttar pradesh,

అంబులెన్స్‌ లేక.. చెల్లి మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లిన అన్న 

భారత్‌ అభివృద్ధి చెందుతోన్న దేశమని.. ప్రజలకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామంటూ నాయకులు చెబుతుంటారు. అన్ని రంగాల్లో మనం ముందున్నామని అంటుంటారు. కానీ.. కొన్ని చోట్ల అభివృద్ధి మచ్చుకైనా కనిపించదు. ఆస్పత్రుల్లో ఎవరైనా చనిపోతే కనీసం డెడ్‌బాడీని తరలించేందుకు అంబులెన్స్‌లు కూడా అందుబాటులో ఉండవు. దాంతో.. ఏం చేయాలో తెలియక బంధువులు మృతదేహాలను భుజాన వేసుకుని.. సైకిళ్లపై తీసుకెళ్లడం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఇలాంటి సంఘటనే ఉత్తర్‌ ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఆస్పత్రిలో అంబులెన్స్‌లు అందుబాటులో లేవని చెప్పడంతో.. మృతదేహాన్ని బైక్‌పై తరలించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు అక్కడి ప్రభుత్వ అధికారుల వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఔరౌయా జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. నవీన్‌ బస్తీకి చెందిన ప్రతాప్‌ సింగ్‌కి అంజలి అనే 20 ఏళ్ల కూతురు ఉంది. అయితే.. ఆమె ఆన్‌ చేసి ఉన్న వాటర్‌ హీటర్‌ను ప్రమాదవశాత్తు తాకింది. దాంతో.. ఆమె విద్యుత్‌ఘాతానికి గురై స్పృహ తప్పి పడిపోయింది. దాంతో.. ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చెంది వెంటనే ఆమెను బిధునా ప్రాథమిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ యువతిని పరిశీలించిన వైద్యులు అప్పటికే అంజలి ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. దాంతో.. యువతి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అయ్యారు. అనుకోని సంఘటన తమ కుటుంబంలో విషాదాన్ని నింపడంతో పుట్టెడు దుఖంతో నిర్ఘాంతపోయారు. చివరకు ఆమె మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్‌ ఇవ్వాలని మృతురాలి సోదరుడు ఆస్పత్రి సిబ్బందిని కోరాడు.

అంబులెన్స్ అందుబాటులో లేదని వైద్యులు చెప్పారు. చివరకు దిక్కుతోచని స్థితిలో అంజలి మృతదేహాన్ని దుప్పటితో చుట్టి బైక్‌పై ఇంటికి తీసుకెళ్లాడు ఆమె సోదరుడు. దుఃఖాన్ని దిగమింగుకుని.. వెనుక మరో సోదరిని కూర్చోబెట్టుకుని.. మధ్యలో అంజలి శవాన్ని చున్నీతో నడుముకి చుట్టుకుని బైక్‌ నడిపాడు. అక్కడే ఉన్న కొందరు దీన్నంతా వీడియో తీశారు. సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేయగా.. వైరల్‌ అయ్యింది. నెటిజన్లు అక్కడి ఆస్పత్రి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంబులెన్స్‌ లేకుండా ఎలా ఆస్పత్రిని నిర్వహిస్తున్నారంటూ మండిపడుతున్నారు.

చివరకు ఈ సంఘటనపై ఉన్నత వైద్యాధికారులు స్పందించారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఇద్దరు వైద్యులు డాక్టర్ అవిచల్ పాండే, డాక్టర్ కృపారామ్‌లను సస్పెండ్ చేశారు. ఆస్పత్రిలో ఎవరైనా చనిపోతే.. మృతదేహాన్ని తరలించేందుకు వారి బంధువులు అంబులెన్స్ అడిగితే తప్పకుండా ఏర్పాటుచేయాలని స్థానిక సీహెచ్‌సీ సూపరింటిండెంట్ డాక్టర్ పాండే అన్నారు. ఈ ఘటనపై స్పందించిన ప్రతిపక్షాలు.. యోగి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి.

Next Story