శుభవార్త.. విదేశీ వ్యాక్సిన్లకు లైన్ క్లియర్
DCGI Exempts Local Bridging Trials For Foreign Vaccines.కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఈ
By తోట వంశీ కుమార్ Published on 2 Jun 2021 12:09 PM ISTకరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఈ మహమ్మారి కట్టడికి వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని నిపుణులు చెబుతున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వాలు అన్ని ప్రజలకు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నాయి. అయితే.. భారత్‌లో వ్యాక్సిన్ కొరత ఉన్న సంగతి తెలిసిందే. దీనిని అధిగమించేందుకు ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. విదేశీ వ్యాక్సిన్లకు అనుమతి ప్రక్రియల్లో డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీజీసీఐ) మార్పులు చేసింది. విదేశాల్లో ఆమోదించిన టీకాలకు భారత్‌లో పరీక్షలు అవసరం లేదని చెప్పింది.
ఇప్పటికే వివిధ దేశాలు, డబ్ల్యూహెచ్ఓ అత్యవసర వినియోగానికి ఆమోదం పొందిన వ్యాక్సిన్లకు భారత్‌లో మళ్లీ ట్రయల్స్ అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో ఫైజర్, మోడెర్నాలాంటి వ్యాక్సిన్లకు లైన్ క్లియర్ కానుంది. ఈ రెండు కంపెనీలు ఇప్పటికే నష్టపరిహారం, ట్రయల్స్ నిర్వహించడం వంటి వాటిని ఎత్తేయాలని కోరాయి. దేశంలో వ్యాక్సిన్లకు ఉన్న డిమాండ్, భారీగా పెరిగిపోతున్న కేసుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీసీజీఐ చీఫ్ వీజీ సోమానీ వెల్లడించారు.
'దేశంలో ఇటీవల కరోనా వ్యాప్తి పెరిగిపోయింది. టీకాల అవసరం తీవ్రంగా ఉంది. విదేశాల నుంచి టీకాల దిగుమతులను పెంచాల్సిన అవసరం ఏర్పడింది. అమెరికా ఎఫ్‌డీఏ, ఈఎంఏ, యూకే, ఎంహెచ్ఆర్ఏ, జపాన్ పీఎండీఏ లేదా ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర అనుమతులు ఇచ్చిన టీకాల్లో మిలియన్ల కొద్ది ప్రజలు వినియోగించిన వాటికి ప్రత్యేక మినహాయింపు ఇచ్చాం. ఆ టీకాలు భారత్‌లో అనుమతుల కోసం కసౌలిలోని సెంట్రల్ డ్రగ్ లేబోరేటరీ బ్రిడ్జ్ ట్రయల్స్‌ను నిర్వహించాల్సిన అవసరం లేదు. కాకపోతే దిగుమతి అయ్యే టీకాలు ఆయా దేశాల నేషనల్ కంట్రోల్ లేబరేటరీల ధ్రువీకరణను పొంది ఉండాలని' డీజీసీఐ చీప్ వి.జి.సొమని లేఖలో పేర్కొన్నారు.