COVID-19 : విజృంభిస్తున్న కరోనా.. 5 నెలల గరిష్టానికి రోజువారీ కేసులు

దేశంలో గ‌త కొద్ది రోజులుగా రోజువారి కేసుల సంఖ్య పెరుగుతుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 March 2023 8:08 AM GMT
COVID-19, India corona update

విజృంభిస్తున్న కరోనా

దేశంలో గ‌త కొద్ది రోజులు క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. రోజువారి కేసులు క్ర‌మంగా పెరుగుతుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. గత కొన్ని రోజులుగా వెయ్యికి పైగా కేసులు నమోదు అవుతుండ‌గా నేడు 5 నెల‌ల గ‌రిష్టానికి రోజువారి కేసుల సంఖ్య పెరిగింది. గ‌డిచిన 24 గంట‌ల్లో 1,890 కొత్త కేసులు న‌మోదు అయిన‌ట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,47,04,147కి చేరింది.

మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాల్లో ఒక్కొక్కరు, కేరళలో ముగ్గురు మ‌ర‌ణించారు. డైలీ పాజిటివిటీ రేటు 1.56 శాతంగా ఉండ‌గా వీక్లీ పాజిటివిటీ రేటు 1.29 శాతంగా ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య 9,433కి చేరాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హమ్మారి నుంచి 4,41,63,883 మంది కోలుకున్నారు. మ‌ర‌ణాల రేటు 1.19శాతంగా న‌మోదైంది. వ్యాక్సిన్‌ డ్రైవ్‌ ద్వారా 220.65 కోట్ల కోవిడ్‌ వ్యాక్సిన్లు అందించారు.

దేశంలో మ‌రోసారి క‌రోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అప్ర‌మ‌త్త‌మైంది. కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పలు సూచనలతో ఒక అడ్వయిజరీ పత్రాన్ని జారీ చేసింది. హాట్‌స్పాట్‌లను గుర్తించడానికి, వైరస్‌ వ్యాప్తి చెందకుండా నివారించేలా మందు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి గరిష్ట స్థాయిలో కొవిడ్‌ పరీక్షలు చేయడం కీలకమని తెలిపింది.

Next Story