తీరాన్ని తాకిన యాస్ తుఫాన్.. 2 గంట‌ల పాటు కొన‌సాగ‌నున్న ప్ర‌క్రియ

Cyclone Yaas Landfall process to continue for 2 hours.ఒడిశాలోని భ‌ద్ర‌క్ జిల్లాలోని దామ్రా ఓడ‌వ‌రేవు స‌మీపంలో య‌స్ తుఫాన్ తీరాన్ని దాటే ప్ర‌క్రియ ప్రారంభ‌మైంద‌ని వాతావ‌ర‌ణ విభాగం(ఐఎండీ) తెలిపింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 May 2021 12:00 PM IST
Cyclone Yaas

ఒడిశాలోని భ‌ద్ర‌క్ జిల్లాలోని దామ్రా ఓడ‌వ‌రేవు స‌మీపంలో య‌స్ తుఫాన్ తీరాన్ని దాటే ప్ర‌క్రియ ప్రారంభ‌మైంద‌ని వాతావ‌ర‌ణ విభాగం(ఐఎండీ) తెలిపింది. తీరాన్ని దాటే ప్ర‌క్రియ ముగియ‌డానికి రెండు గంట‌లు ప‌ట్టే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. బుధ‌వారం మ‌ధ్నాహ్నాం ఒంటి గంట స‌మ‌యంలో పూర్తిగా తీరాన్ని దాటే అవ‌కాశం ఉంద‌ని ఒడిశా స్పెష‌ల్ రిలీఫ్ క‌మిష‌న‌ర్ పీఏ జెనా తెలిపారు. అలాగే తీర‌ప్రాంతాల్లోని జిల్లాల్లో గంట‌ల‌కు 140 నుంచి 155 కిలోమీట‌ర్ల వేగంగా బ‌ల‌మైన గాలులు వీచే అవ‌కాశం ఉంద‌న్నారు.

కోల్‌కతాను ముంచెత్తిన వర్షాలు..

అంత‌క‌ముందు..'యాస్' తుపాను తీరాన్ని తాకడానికి ముందే బుధవారం ఉదయం పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాను ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు ముంచెత్తాయి. తుపాను తీరాన్ని తాకనున్నందున ఒడిశా, పశ్చిమబెంగాల్, జార్ఖాండ్‌లోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చని ఐఎండీ అంచనా వేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన యాస్ తుపాను అతి తీవ్ర తుపాను గా మారడంతో ఒడిశాలో తుపాను ప్రభావం కనిపిస్తోంది. చాందీపూర్, బాలాసోర్ ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతుండగా, పశ్చిమబెంగాల్‌లోని దిగా తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. పెద్దఎత్తున తీర ప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Next Story