మయన్మార్ భూకంప సహాయ చర్యల్లో పాల్గొన్న.. భారత్ విమానంపై సైబర్ దాడి
మయన్మార్‌లో ఆపరేషన్ బ్రహ్మ సహాయక చర్య సందర్భంగా భారత వైమానిక దళానికి చెందిన C-130J విమానం జీపీఎస్-స్పూఫింగ్ దాడిని ఎదుర్కొన్నట్లు రక్షణ వర్గాలు తెలిపాయి.
By అంజి
మయన్మార్ భూకంప సహాయ చర్యల్లో పాల్గొన్న.. భారత్ విమానంపై సైబర్ దాడి
భూకంపంతో దెబ్బతిన్న ఆగ్నేయాసియా దేశం మయన్మార్‌లో ఆపరేషన్ బ్రహ్మ సహాయక చర్య సందర్భంగా భారత వైమానిక దళానికి చెందిన C-130J విమానం జీపీఎస్-స్పూఫింగ్ దాడిని ఎదుర్కొన్నట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. ఈ స్పూఫింగ్ రియల్-టైమ్ కోఆర్డినేట్‌లను మార్చి, విమానం మధ్యలో నావిగేషన్ సిస్టమ్‌ను తప్పుదారి పట్టించిందని వారు తెలిపారు. సురక్షితమైన నావిగేషన్‌ను నిర్ధారించడానికి వైమానిక దళ పైలట్లు వెంటనే అంతర్గత నావిగేషన్ సిస్టమ్ కి మారారని రక్షణ వర్గాలు తెలిపాయి.
జీపీఎస్ స్పూఫింగ్ అనేది ఒక రకమైన సైబర్ దాడి, దీనిలో నకిలీ సిగ్నల్స్ వ్యవస్థలను గందరగోళపరిచేందుకు నిజమైన ఉపగ్రహ డేటాను భర్తీ చేస్తాయి. భారత్-పాకిస్తాన్ సరిహద్దు సమీపంలో ఇలాంటి స్పూఫింగ్ సంఘటనలు జరిగాయి. నవంబర్ 2023 నుండి ఇప్పటివరకు అమృత్సర్, జమ్మూ సమీపంలో 465 కేసులు నమోదయ్యాయి.
మార్చి 28న, మయన్మార్‌లో 7.7 తీవ్రతతో సంభవించిన శక్తివంతమైన భూకంపం 3,649 మంది మృతి చెందగా, 5,000 మందికి పైగా గాయపడ్డారు. ఆ తర్వాత వెంటనే వందకు పైగా అనంతర ప్రకంపనలు సంభవించాయి. పొరుగున ఉన్న థాయిలాండ్, ఈశాన్య భారతదేశంలో కూడా ప్రకంపనలు సంభవించాయి. భూకంపంతో దెబ్బతిన్న మయన్మార్‌లో సెర్చ్ అండ్ రెస్క్యూ (SAR), మానవతా సహాయం, విపత్తు ఉపశమనం మరియు వైద్య సహాయం వంటి అవసరమైన సహాయాన్ని అందించడానికి భారతదేశం ఆపరేషన్ బ్రహ్మను ప్రారంభించింది .
మార్చి 29న భారతదేశం మయన్మార్‌కు మొదటి విడత మానవతా సహాయం, విపత్తు ఉపశమనం సామాగ్రిని పంపిణీ చేసింది, ఇందులో NDRF, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సరఫరా చేసిన టెంట్లు, దుప్పట్లు, అవసరమైన మందులు, ఆహారం వంటి 15 టన్నుల సామాగ్రిని C-130J విమానం ఉపయోగించి పంపిణీ చేసింది. ఇప్పటివరకు, ఆరు విమానాలు, ఐదు భారత నావికాదళ నౌకలు 625 మెట్రిక్ టన్నుల HADR సామగ్రిని పంపిణీ చేశాయి.