కోవిన్ రిజిస్ట్రేష‌న్‌.. స‌తాయిస్తున్న‌స‌ర్వ‌ర్‌

CoWin server down. 18 ఏళ్ల పైబడిన వారికి కరోనా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్, వ్యాక్సినేషన్ కోసం ఎంతో మంది ఎగబడడంతో మొదటి నిమిషానికే చేతులెత్తేసింది కోవిన్ సర్వర్.

By Medi Samrat  Published on  28 April 2021 4:45 PM IST
CoWin Server

18 ఏళ్ల పైబడిన వారికి కరోనా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం అయింది. బుధవారం సాయంత్రం 4 గంటలకు ఈ రిజిస్ట్రేషన్ ప్రారంభమమైంది. ఏప్రిల్ 28 న కోవిద్ వ్యాక్సినేషన్ కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుందని మొదట ప్రకటించడంతో చాలామంది అర్ధరాత్రి 12 గంటల నుంచి రిజిస్ట్రేషన్ కోసం ప్రయత్నిస్తూ వచ్చారు. 18 ఏళ్ళు పైబడినవారందరికీ కోవిన్ రిజిస్ట్రేషన్ (ఆరోగ్యసేతు యాప్, ఉమంగ్ యాప్) 28 వ తేదీ 4 గంటలకు లాంచ్ అవుతుందని క్లారిటీ వచ్చింది. వ్యాక్సిన్ కేంద్రాల విషయంలో అపాయింట్ మెంట్లకు సంబంధించి రాష్ట్ర, ప్రైవేటు సెంటర్ల వద్ద సమాచారం ఉంటుంది. 18 ఏళ్ళు పైబడినవారికందరికీ మే 1 నుంచి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కేంద్రం చేబట్టింది.

ఇక వ్యాక్సినేషన్ కోసం ఎంతో మంది ఎగబడడంతో మొదటి నిమిషానికే చేతులెత్తేసింది కోవిన్ సర్వర్. దీంతో దేశ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. పేజీ లోడ్ అవ్వడానికే ఎక్కువ సమయం తీసుకుంటూ ఉంది. 18 ఏళ్లు దాటిన వారంతా వ్యాక్సిన్ వేయించుకోవడానికి తమ పేరు, మొబైల్ నంబర్, ఆధార్ నంబర్ వంటి వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేయించుకున్నవారికి టైమ్ స్లాట్ ఇస్తారు. ఆ రోజు ఆ టైమ్‌లో వారు చెప్పిన కోవిడ్ కేంద్రానికి వెళ్లి వ్యాక్సిన్ తొలి డోస్ వేయించుకోవాల్సి ఉంటుంది. అయితే కోవిన్ సర్వర్ చేతులెత్తేయడంతో ఏమి చేయాలో పాలు పోని స్థితిలో అందరూ ఉన్నారు. ఇలాంటి సమయంలో సర్వర్ గురించి సరైన శ్రద్ధ తీసుకుని ఉంటే బాగుండేదని ప్రభుత్వ పనితీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.


Next Story