గర్భిణికి నెగెటివ్.. పుట్టిన బిడ్డకు పాజిటివ్.. ఇదేమి ట్విస్ట్..!

Covid negative mother delivers Covid positive baby in Varanasi. గర్భిణీకి కరోనా సోకలేదు కానీ.. అప్పుడే పుట్టిన బిడ్డకు మాత్రం కరోనా నిర్ధారణ అయింది.

By M.S.R  Published on  28 May 2021 12:41 PM GMT
baby

కరోనా మహమ్మారి ఏ ఒక్కరిని కూడా వదిలి పెట్టడం లేదు. అప్పుడే పుట్టిన బిడ్డ నుండి.. బయట ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేని ముసలి వాళ్ళకు కూడా సోకుతోంది. అప్పుడే పుట్టిన బిడ్డలు కూడా కరోనా పాజిటివ్ వచ్చిన ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే ఓ సరికొత్త కేసు వైద్యులకే సవాల్ విసిరింది. అదేమిటంటే గర్భిణీకి కరోనా సోకలేదు కానీ.. అప్పుడే పుట్టిన బిడ్డకు మాత్రం కరోనా నిర్ధారణ అయింది. తల్లికి లేకుండా బిడ్డకు కరోనా ఎలా వచ్చిందా అని వైద్యులు కూడా షాక్ అవుతూ ఉన్నారు.

బ‌నార‌స్ హిందూ యూనివ‌ర్సిటీలోని సర్ సుందర్‌లాల్ ఆసుపత్రిలో చోటు చేసుకున్న ఈ సంఘ‌ట‌న‌కు వైద్యులు ఆశ్చ‌ర్య‌పోయారు. వార‌ణాసికి చెందిన సుప్రియ అనే మహిళ కాన్పు కోసం మే 24న ఆసుప‌త్రిలో చేరింది. ఆ స‌మ‌యంలో వైద్యులు సుప్రియ‌కు ఆర్‌టీపీసీఆర్ విధానంలో కోవిడ్ పరీక్ష నిర్వ‌హించారు. ఇందులో ఆమెకు నెగిటివ్‌గా తేలింది. ఇక మే 25న వైద్యులు సుప్రియ‌కు స‌ర్జ‌రీ చేయ‌గా ఆడ బిడ్డ‌ పుట్టింది. సాధార‌ణ పరీక్ష‌లో భాగంగా చిన్నారికి కోవిడ్ టెస్ట్ చేయ‌గా పాజిటివ్ వ‌చ్చింది. చిన్నారికి క‌రోనా పాజిటివ్‌గా తేలిన‌ప్ప‌టికీ ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని వైద్యులు చెబుతున్నారు. ప్ర‌స్తుతం త‌ల్లీబిడ్డ ఒకే ద‌గ్గ‌ర ఉన్నార‌ని మ‌రికొన్ని రోజుల త‌ర్వాత ఇద్ద‌రినీ వేరు వేరుగా ఉంచుతామ‌ని వివ‌రించారు. ఇక నాలుగు రోజులు గ‌డిచాక మ‌రోసారి ఇద్ద‌రికీ క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని అధికారులు చెబుతున్నారు. పసికందుకు కరోనా సోకింది. ఎలా సోకిందో తెలియడం లేదు. అన్నీ జాగ్రత్తలు తీసుకున్నామని వైద్య సిబ్బంది చెబుతోంది.


Next Story