గుడ్‌న్యూస్.. 5 నిమిషాల్లోనే సంక్రమణ సామర్థ్యాన్ని కోల్పోతున్న కరోనా వైరస్
Covid loses 90% of ability to infect within 20 minutes in air.కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ముఖ్యంగా
By తోట వంశీ కుమార్ Published on 13 Jan 2022 8:40 AM ISTకరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ముఖ్యంగా అమెరికా, బ్రిటన్ సహా పలు దేశాలు ఈ మహమ్మారి ధాటికి చిగురుటాకులా వణికిపోతున్నాయి. జనజీవనం స్తంభించిపోతుంది. ఇక మనదేశంలోనూ గత కొద్ది రోజులుగా రోజుకు లక్షకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. ఈ మహమ్మారిని పూర్తిగా అంతం చేయడానికి శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో శాస్త్రవేత్తలు ఓ శుభవార్తను చెప్పారు.
గాల్లో కరోనా వైరస్ ఎంతసేపు ప్రభావవంతంగా ఉంటుందన్న దానిపై పరిశోధనలు చేయగా.. కీలక విషయాలను గుర్తించారు. యూకేలోని బ్రిస్టల్ యూనివర్సిటీకి చెందిన ఏరోసోల్ రీసెర్చ్ సెంటర్ ప్రచురించిన ఓ అధ్యయనం మేరకు.. కరోనా వైరస్ గాల్లో 20 నిమిషాల పాటు ఉంటే దాని సామర్థ్యం 90 శాతం క్షీణిస్తుందని తెలిపారు. గాలిలో ఉన్న తొలి 5 నిమిషాల్లోనే సంక్రమణ శక్తిని పెద్ద మొత్తంలో కోల్పోతున్నట్లు అందులో పేర్కొన్నారు.
మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వల్ల కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయొచ్చునని ఈ అధ్యయంలో పాల్గొన్న ప్రొఫెసర్ జొనాథన్ రీడ్ చెప్పారు. వెంటిలేషన్ సరిగా లేని ప్రాంతాల్లోనే కరోనా వైరస్ అధికంగా సంక్రమిస్తుందని.. చాలా మంది ఈ అంశంపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారన్నారు. అయితే.. ప్రజలు దగ్గరదగ్గరగా ఉంటేనే వైరస్ సోకే ప్రమాదం అధికంగా ఉంటుందని ప్రొఫెసర్ చెప్పుకొచ్చారు.
ఇక కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పై దక్షిణాఫ్రికాలో నిర్వహించిన పరిశోధనల్లో కీలక అంశాలు వెలుగుచూశాయి. కరోనా మిగిలిన వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ సోకిన వారిలో అధిక సంఖ్యలో లక్షణాలు కనిపించడం లేదన్నారు. ఫలితంగా వీరు వాహకులుగా మారి వ్యాప్తిని మరింత అధికం చేస్తున్నట్లుగా గుర్తించారు.