ఇక ఇంటి వద్దే క‌రోనా ప‌రీక్ష‌.. 'కొవిసెల్ఫ్‌'కు ఐసీఎంఆర్‌ ఆమోదం

Covid home test kit gets approval. ఇంట్లోనే కరోనా పరీక్షలు చేసుకునేందుకు ఐసీఎంఆర్ అనుమతించింది. పుణేకు చెందిన మైల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ తయారు చేసిన 'ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టింగ్‌ కిట్‌ 'కొవిసెల్ఫ్‌'కు ఆమోదముద్ర వేసింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 May 2021 7:55 AM GMT
Covid home test kit

దేశ వ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతున్న‌ నేపథ్యంలో ఇంటింటికెళ్లి పరీక్షలు నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఆదేశాలు జారీచేశారు. ప్రధాని ఆదేశాల మేరకు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) కార్యాచరణకు సిద్ధమయింది. ఇందుకు సంబంధించిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను బుధ‌వారం రాత్రి విడుద‌ల చేసింది. ఇంట్లోనే కరోనా పరీక్షలు చేసుకునేందుకు ఐసీఎంఆర్ అనుమతించింది. పుణేకు చెందిన మైల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ తయారు చేసిన 'ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టింగ్‌ కిట్‌ 'కొవిసెల్ఫ్‌'కు ఆమోదముద్ర వేసింది.

దీని ద్వారా కొవిడ్‌ లక్షణాలున్న వ్యక్తలు స్వయంగా కిట్‌ను వినియోగించి ముక్కు ద్వారా నమూనాలు సేకరించి పరీక్ష చేసుకోవచ్చు. ల్యాబ్‌లో పాజిటివ్‌గా పరీక్షించిన వ్యక్తుల రోగ లక్షణాలు తెలుసుకునేందుకు, కాంటాక్ట్‌ పరిచయాలు మాత్రమే హోం టెస్ట్‌ కిట్‌ను వినియోగించాలని ఐసీఎంఆర్‌ స్పష్టం చేసింది. యాంటీజెన్‌ కిట్ల ద్వారా పాజిటివ్‌గా తేలిన వారందరినీ పాజిటివ్‌గా పరిగణించవచ్చని, అయితే వారికి మళ్లీ పరీక్షలు చేయాల్సిన అవసరం లేదని తెలిపింది.

యాంటీజెన్‌ టెస్టు ద్వారా నెగెటివ్‌గా తేలి, లక్షణాలున్న వ్యక్తులందరూ వెంటనే ఆర్‌టీపీసీఆర్‌ టెస్టును చేయించుకోవాలని సూచించింది. యాంటీజెన్‌ టెస్టులో నెగెటివ్‌గా తేలి, లక్షణాలున్న వారందరినీ కొవిడ్‌ అనుమానితులుగా భావించొచ్చని, వారంతా ఐసీఎంఆర్‌.. ఆరోగ్య శాఖ హోం ఐసొలేషన్‌ మార్గదర్శకాలను పాటించాలని సూచించింది. ఈ ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్‌ను పుణెలోని మైల్యాబ్‌ డిస్కవరీ సొల్యూషన్స్‌ సంస్థ ఈ కిట్‌ను తయారు చేసింది.

'కొవిసెల్ఫ్‌'కు ఎలా పని చేస్తుందంటే?

- ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్ట్‌ కిట్‌ను వినియోగించేందుకు మొబైల్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. అనుస‌రించి అందులో పేర్కొన్న నిబంధనలను అనుసరించి పరీక్షలు నిర్వహించాలి. రోగికి పాజిటివ్, నెగెటివ్‌ టెస్ట్‌ ఫలితాలు అందించాలి.

- పరీక్ష ప్రక్రియ పూర్తయిన తర్వాత దానికి ఉపయోగించిన టెస్ట్‌ స్ట్రిప్‌ను యాప్, యూజర్‌ రిజిస్ట్రేషన్‌ చేసిన మొబైల్‌ఫోన్‌లో ఫొటో తీయాలి. ఇందులో నమోదు చేసిన డేటాను కేంద్రీకృత సర్వర్‌లో భద్రంగా నిల్వచేస్తారు. ఆ సర్వర్‌ ఐసీఎంఆర్‌ కొవిడ్‌-19 టెస్టింగ్‌ పోర్టల్‌కు అనుసంధానమై ఉంటుంది. అంతిమంగా డేటా అంతా ఇందులోనే నిల్వ ఉంటుంది. ఈ ప‌రీక్ష‌ల్లో పాజిటివ్‌ వచ్చిన రోగులంతా 100శాతం పాజిటివ్‌గానే భావించాలి. మరోసారి పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం లేదు. వారంతా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం ఐసోలేషన్‌లోనే ఉండాలి.

- కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ ర్యాపిడ్ టెస్టుల్లో నెగెటివ్‌ వస్తే వెంటనే ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు చేయించుకోవాలి. తక్కువ వైరల్‌ లోడ్‌ ఉన్నవారి గుర్తించడంలో ర్యాట్‌ పరీక్షలు విఫలమయ్యే అవకాశం ఉన్నందున నెగెటివ్‌ వచ్చిన వారు ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలకు వెళ్లాలి. లక్షణాలున్నా ఇందులో నెగెటివ్‌ వచ్చిన వారిని అనుమానిత కొవిడ్‌ రోగులుగా పరిగణించి వెంటనే ఐసోలేషన్‌కు వెళ్లమని చెప్పాలి. ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్ష ఫలితం వచ్చేంతవరకు వారు దాన్ని అనుసరించాలి.

- మైలాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ తయారు చేసిన ఈ కిట్‌ మరో వారంలో మార్కెట్‌లోకి అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. దీని ధర సుమారు రూ.250 వరకు ఉంటుందని అంచనా. పరీక్ష ఫలితాలు ఐదు నుంచి నిమిషాలు పడుతుందని, గరిష్ఠంగా 15 నిమిషాలు పరీక్ష ఫలితాలు తెలుస్తాయని కంపెనీ పేర్కొంది.


Next Story
Share it