క‌రోనా టీకాల‌ను ఎత్తుకెళ్లాడు.. తిరిగిచ్చాడు.. ఎందుకంటే..?

Covid-19 vaccine stolen in civil hospital in haryana.తాను పోలీసులకు ఆహారం సరఫరా చేస్తున్నానని.. తనకు వేరే పనిఉండటంతో ఆ పెట్టెను పోలీసులకు ఇవ్వాలని చెప్పి దొంగ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 April 2021 2:42 AM GMT
covid vaccines stolen

ఇప్పటికే కరోనా తో జనం అల్లాడి పోతుంటే, మరోవైపు వ్యాక్సిన్ కొరత కూడా ప్రజలని ఇబ్బంది పెట్టేస్తోంది. ఇంకా హర్యానా లోని జింద్‌ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఒక వింతైన సంఘటన జరిగింది. ఆసుపత్రి స్ట్రాంగ్ రూమ్ నాలుగు తాళ్ళాలు బద్ధలుకొట్టి మందుల బాక్స్ తీసుకెళ్లిపోయారు. దీంతో ఆసుపత్రి సిబ్బంది పోలీసును ఆశ్రయించారు. అయితే కొన్ని గంటల తరువాత, ఎత్తుకెళ్లిన దొంగే వాటిని తిరిగిచ్చేశాడు. జింద్‌లోని సివిల్‌ లైన్స్‌ పోలీసు స్టేషన్‌కు ఎదురుగా టీ కొట్టులో ఉన్న ఓ వ్యక్తికి వ్యాక్సిన్ల పెట్టెను ఇచ్చాడు. తాను పోలీసులకు ఆహారం సరఫరా చేస్తున్నానని.. తనకు వేరే పనిఉండటంతో ఆ పెట్టెను పోలీసులకు ఇవ్వాలని చెప్పి దొంగ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

పోలీసులు ఆ పెట్టెను తెరవగా వారికి సుమారు 700 అంటే 440 కొవాగ్జిన్‌, 182 కొవిషీల్డ్‌ టీకా డోసులతో పాటు ఓ ఉత్తరం కనిపించింది. హిందీలో ఉన్న ఆ ఉత్తరంలో.. '' క్షమించండి. ఇవి కరోనా టీకాలు అని నాకు తెలియదు'' అని రాశాడు. ప్రస్తుతం మార్కెట్‌లో కొరత ఉన్న కరోనా చికిత్సలో వాడే రెమిడెసివిర్‌ ఇంజెక్షన్లుగా భావించి వ్యాక్సిన్లను దొంగ ఎత్తుకెళ్లి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడికోసం సి సి టీవి ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


Next Story
Share it