మరో కొత్త ఫంగస్ వెలుగులోకి.. అదే గ్రీన్ ఫంగస్..!
Covid 19 recovered patient diagnosed with green fungus.కరోనా మహమ్మారి సృష్టించిన భీభత్సం అంతా ఇంతా కాదు.
By తోట వంశీ కుమార్ Published on 16 Jun 2021 5:42 AM GMTకరోనా మహమ్మారి సృష్టించిన భీభత్సం అంతా ఇంతా కాదు. ఈ మహమ్మారి నుంచి ఇంకా కోలుకోక ముందే పలు రకాల ఫంగస్‌లు వెలుగులోకి వచ్చాయి. బ్లాక్, వైట్, ఎల్లో ఫంగస్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. దీని నుంచి ఇంకా తేరుకోకముందే తాజాగా మరో ఫంగస్ వెలుగులోకి వచ్చింది. అదే గ్రీన్ ఫంగస్. తొలిసారిగా మధ్యప్రదేశ్ ఇండోర్‌లో కరోనా నుంచి కోలుకున్న ఓ వ్యక్తిలో గ్రీన్ ఫంగస్ లక్షణాలు కనిపించాయి.
ఇండోర్ నగరంలోని అరబిందో ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనే కొవిడ్ ఆస్పత్రిలో కోలుకున్న ఓ 34 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తికి బ్లాక్ ఫంగస్ సంక్రమించిందనే అనుమానంతో పరీక్ష చేయగా రోగి సైనస్, ఊపిరితిత్తులు, రక్తంలో ఆకుపచ్చ ఫంగస్ సంక్రమించిందని తేలింది. వెంటనే అతడిని ఎయిర్ అంబులెన్స్ ద్వారా ముంబైలోని ఆస్పత్రికి తరలించామని సీనియర్ వైద్యులు తెలిపారు. గ్రీన్ ఫంగస్ సోకిన వ్యక్తి కరోనా వైరస్ తో స్థానిక ఆస్పత్రిలో నెలరోజుల పాటు ఐసీయూలో చికిత్స పొందారు. కరోనా నుంచి కోలుకున్నా, ముక్కు నుంచి రక్తస్రావం కావడం, అధిక జ్వరంతో పాటు బరువు తగ్గడంతో అతనికి పరీక్ష చేయగా గ్రీన్ ఫంగస్ అని తేలిందని డాక్టర్ రవి చెప్పారు.
కాగా.. ఈ ఫంగస్ బ్లాక్, వైట్ ఫంగస్ కంటే ప్రమాదకరమని అంటున్నారు. గ్రీన్ ఫంగస్ సంక్రమణపై మరిన్ని పరిశోధనలు అవసరమని డాక్టర్లు చెబుతున్నారు.