కన్నీళ్లు పెట్టిస్తోన్న ఓ కుమారుడి ఆవేదన.. 'బెడ్ ఇవ్వండి.. లేదా మా నాన్నను చంపేయండి'

Covid 19 patient son heart rending plea. తీవ్ర ఆవేద‌నకు గురైన అత‌డు త‌న తండ్రికి ఆస్ప‌త్రిలో బెడ్ అయినా ఇవ్వండి లేదా ఓ ఇంజెక్ష‌న్ ఇచ్చి చంపేయండి ప్రాదేయ‌ప‌డుతున్న వీడియో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 April 2021 8:34 AM GMT
covid 19 patient

దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ ఉద్దృతి కొన‌సాగుతోంది. మొద‌టి వేవ్‌తో పోలిస్తే రెండ‌వ వేవ్‌లో కేసులు పెద్ద సంఖ్య‌లో న‌మోదు అవుతున్నాయి. ఆస్ప‌త్రుల్లో చేరే వారి సంఖ్య భారీగా పెరిగింది. దీంతో కొన్ని చోట్ల ఆస్ప‌త్రుల్లో బెడ్‌లు స‌రిపోవ‌డం లేదు. పేషంట్ల‌ను వెన‌క్కి పంపేస్తున్నారు. అంబులెన్స్‌లో కూడా చికిత్స అందిస్తున్న‌ప్ప‌టికి.. వ‌చ్చే పేషంట్ల‌కు అవి ఏ మాత్రం స‌రిపోవ‌డం లేదు. క‌రోనా పేషంట్ల‌కు చికిత్స అంద‌క‌పోవ‌డంతో వారుప‌డుతున్న బాధ‌ను చూడ‌లేక వారిని చంపేయ‌మ‌ని కుటుంబ స‌భ్య‌లు చెప్ప‌డం ప్ర‌స్తుత ప‌రిస్థితికి అద్దం ప‌డుతోంది. ఓ తండ్రి క‌రోనా బారిన ప‌డ‌డంతో.. ఆస్ప‌త్రిలో చేర్పించ‌డాని అంబులెన్స్‌లో అత‌డి కుమారుడు రెండు రాష్ట్రాల్లో తిరిగిన‌ప్ప‌టికి ఫ‌లితం లేక‌పోయింది. దీంతో తీవ్ర ఆవేద‌నకు గురైన అత‌డు త‌న తండ్రికి ఆస్ప‌త్రిలో బెడ్ అయినా ఇవ్వండి లేదా ఓ ఇంజెక్ష‌న్ ఇచ్చి చంపేయండి ప్రాదేయ‌ప‌డుతున్న వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

వివ‌రాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని చంద్రపూర్‌కు చెందిన సాగర్ కిషోర్ అనే వ్య‌క్తి తండ్రికి క‌రోనా సోకింది. అత‌డికి ల‌క్ష‌ణాలు తీవ్రంగా ఉండ‌డంతో అంబులెన్స్‌లో ఆస్ప‌త్రికి త‌ర‌లించేందుకు య‌త్నించాడు. చంద్రపూర్ శివారు ప్రాంతాల్లోని ఆసుపత్రులన్నీ తిరిగాడు. అయితే.. ఆస్ప‌త్రుల‌న్ని పేషెంట్లతో కిక్కిరిసిపోయాయి. వృద్ధులైన పేషెంట్లు ఎంతో మంది ఆసుపత్రుల ఎదుట అంబులెన్సుల్లోనే ఉన్నారు. మ‌రోవైపు క‌రోనా బాధితులంతా ఆస్ప‌త్రుల‌కు రావ‌డంతో అక్క‌డి ఆస్ప‌త్రుల‌ను 24 గంట‌లు మూసివేశారు. అంబులెన్స్‌లో ఉన్న సాగ‌ర్ తండ్రి ద‌గ్గుతో తీవ్రంగా ఇబ్బంది ప‌డుతున్నారు. ఇక ఇక్క‌డ తిరిగే లాభం లేద‌ని.. ప‌క్క‌నే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఆస్ప‌త్రిలో జాయిన్ చేద్దామ‌ని అనుకున్నాడు.

అయితే.. అక్క‌డ కూడా ఇలాంటి ప‌రిస్థితే ఎదురైంది. 'తొలుత చికిత్స కోసం స్థానిక వ‌రోరా ఆస్పత్రికి తీసుకెళ్లాం. ఆ త‌రువాత చంద్రాపూర్‌లోని మ‌రో ఆస్ప‌త్రికి వెళ్లాను. అక్క‌డి నుంచి ప్రైవేటు ఆస్ప‌త్రుల‌కు కూడా ప‌రుగులు తీశాను. ఎక్క‌డా బెడ్‌లు అందుబాటులో లేవు. తెలంగాణ‌కు వ‌చ్చినా అదే ప‌రిస్థితి ఎదురైంది. దీంతో మ‌ళ్లీ మ‌హారాష్ట్ర‌కే వెళ్లాన‌ని' మీడియాతో చెప్పాడు.


అంబులెన్సులో ఆక్సిజ‌న్ లేని ప‌రిస్థితి.. పెషంట్ ద‌గ్గుతో బాధ‌ప‌డుతున్నాడు. దీంతో 'ఆస్పత్రిలో బెడ్ ఇవ్వండి… లేదా ఆయనను చంపేయండి' అంటూ కంటతడి పెట్టుకున్నాడు. బెడ్ ఇచ్చి చికిత్స అందించాలని, లేకపోతే తన తండ్రిని ఇంటికి తీసుకెళ్లబోనని స్పష్టం చేశాడు. కొవిడ్ ప‌రిస్థితులే ఆయ‌న్ను అలా మాట్లాడేలా చేశాయ‌ని అక్కడివారు వాపోయారు.


Next Story
Share it