కొవాగ్జిన్ టీకాపై గుడ్ న్యూస్ చెప్పిన ఐసీఎంఆర్.. విదేశీ టీకాలపై భారత్ దిగుమతి సుంకం ఎత్తేసేనా..?

Covaxin works on all Covid mutations. కరోనా వైరస్ లో కొత్త కొత్త రకాలు పుట్టుకొస్తూ ఉన్న సంగతి తెలిసిందే..!

By Medi Samrat  Published on  21 April 2021 12:12 PM GMT
covaxin

కరోనా వైరస్ లో కొత్త కొత్త రకాలు పుట్టుకొస్తూ ఉన్న సంగతి తెలిసిందే..! ఇప్పుడు ఉన్న వ్యాక్సిన్లు వాటిని ఎదుర్కొంటాయా లేదా అనే అనుమానాలు కూడా లేకపోలేదు. అయితే కరోనా వైరస్‌లోని కొత్త రకాలను కూడా కొవాగ్జిన్ టీకా సమర్థవంతంగా అడ్డుకుంటోందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. భారత్ బయోటెక్ కు చెందిన ఈ టీకా యూకే, బ్రెజిల్, దక్షిణాఫ్రికా రకం వైరస్‌లను కూడా విజయవంతంగా అడ్డుకుంటోందని తెలుస్తోంది.. అలాగే భారత్‌లో పుట్టిన డబుల్ మ్యూటెంట్ రకంపైనా ఇది బలంగా పనిచేస్తోంది. ఇంజెక్షన్ రూపంలో తీసుకునే కొవిడ్ వ్యాక్సిన్ ఊపిరితిత్తుల కింది భాగాన్నే వైరస్ నుంచి రక్షిస్తుందని, పైభాగాన్ని కాదని అన్నారు. కాబట్టి టీకా తీసుకున్న తర్వాత శరీరంలోకి వైరస్ ప్రవేశించినా ప్రాణాంతకంగా మారదని భారత్ బయోటెక్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణా యెల్లా తెలిపారు. టీకా తీసుకున్న తర్వాత ఇన్ఫెక్షన్లు వచ్చినా భయపడాల్సిన అవసరం లేదని.. టీకా తీసుకున్న తర్వాత కూడా మాస్క్ ధరించడం మాత్రం తప్పనిసరి అని చెప్పుకొచ్చారు.

భారత్ లో టీకాలకు డిమాండ్‌ భారీగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే.. దేశీయంగా అందుబాటులోకి వచ్చిన రెండు టీకాలు సరిపోకపోవడంతో విదేశాల నుంచి టీకాల్ని దిగుమతి చేసుకోవాలని కేంద్రం భావిస్తోంది. ఇప్పటికే పలు విదేశీ టీకా సంస్థలు భారత్‌లో దరఖాస్తు చేసుకున్నాయి. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం విదేశీ టీకాలపై 10 శాతం దిగుమతి సుంకం వర్తిస్తుంది. ఐజీఎస్టీ, సర్‌ ఛార్జీలు కలుపుకొని టీకా ఖరీదు భారీగా పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో టీకాల్ని భారత్‌లో తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్రం భావిస్తుండగా.. ఈ మేరకు 10 శాతం దిగుమతి సుంకాన్ని రద్దు చేయాలనే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు చెబుతూ ఉన్నారు. ప్రైవేటు సంస్థలు టీకాల్ని విదేశాల నుంచి కొనుగోలు చేసి బహిరంగ మార్కెట్లో విక్రయించేందుకు అనుమతించాలని కూడా కేంద్రం ఆలోచిస్తోంది.


Next Story
Share it