త్రివర్ణ పతాకానికి 21 సార్లు సెల్యూట్ చేయాలని నిందితుడికి కోర్టు ఆదేశం.. అతడు చేసిన నేరం ఏమిటంటే..
'పాకిస్థాన్ జిందాబాద్, హిందుస్థాన్ ముర్దాబాద్' అంటూ నినాదాలు చేసిన నిందితుడికి మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రత్యేక షరతుపై బెయిల్ మంజూరు చేసింది.
By Kalasani Durgapraveen Published on 17 Oct 2024 12:22 PM IST'పాకిస్థాన్ జిందాబాద్, హిందుస్థాన్ ముర్దాబాద్' అంటూ నినాదాలు చేసిన నిందితుడికి మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రత్యేక షరతుపై బెయిల్ మంజూరు చేసింది. విచారణ పూర్తయ్యే వరకూ నెలకు రెండుసార్లు పోలీస్ స్టేషన్‌కు రావాలని.. ప్రతిసారీ 'భారత్ మాతాకీ జై' అంటూ 21 సార్లు భారత జాతీయ జెండాకు వందనం చేయాలని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. భోపాల్‌లో నివసిస్తున్న నిందితుడు ఫైజల్ అలియాస్ ఫైజాన్‌ను ప్రతి నెల మొదటి, నాల్గవ మంగళవారం ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 గంటల మధ్య మిస్రోడ్ పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. 50 వేల రూపాయల పూచీకత్తుపై నిందితుడు ఫైజాన్‌కు బెయిల్ మంజూరు చేసింది.
నిందితుడు ఫైజాన్‌ను ఈ ఏడాది మే 17న భోపాల్‌లోని మిస్రోడ్ పోలీసులు అరెస్టు చేసింది. ఫైజాన్‌కు సంబంధించి 'పాకిస్థాన్ జిందాబాద్, హిందుస్థాన్ ముర్దాబాద్' అంటూ నినాదాలు చేసిన వీడియో వైరల్ కావడంతో భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి) సెక్షన్ 153బి కింద పోలీసులు నిందితుడిపై చర్యలు తీసుకున్నారు.
పిటీషనర్‌ను తప్పుగా ఇరికించారని ఫైజాన్ తరపు న్యాయవాది వాదించారు. బెయిల్‌ను ప్రాసిక్యూషన్ వ్యతిరేకిస్తూ దరఖాస్తుదారుడు నేరస్తుడని.. అతనిపై 14 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని పేర్కొంది. తాను పుట్టి పెరిగిన దేశానికి వ్యతిరేకంగా బహిరంగంగానే నినాదాలు చేస్తున్నాడని వాదించింది. అయితే కొన్ని కఠిన షరతులు విధిస్తూ తనకు బెయిల్ మంజూరు చేయాలని పిటీషనర్ కోర్టును అభ్యర్థించారు. ఇరువైపుల వాదనలు విన్న జస్టిస్ దినేష్ కుమార్ పలివాల్ మాట్లాడుతూ.. దరఖాస్తుదారుడిపై 13 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని.. వీడియోలో ఆయన నినాదాలు చేస్తున్నట్టు కనిపిస్తున్నదని అన్నారు. దరఖాస్తుదారుని కొన్ని షరతులకు లోబడి బెయిల్‌పై విడుదల చేయవచ్చని నేను అభిప్రాయపడుతున్నానని పేర్కొన్నారు.
నిందితుడు విచారణ ముగిసే వరకు ప్రతి నెలా మొదటి, నాలుగో మంగళవారాల్లో పోలీస్ స్టేషన్‌కు హాజరుకావాలని.. పోలీసు స్టేషన్ భవనంపై జాతీయ జెండాను ఎగురవేసి 'భారత్ మాతా కీ జై' నినాదాలు చేయాలని ఆదేశాలు జారీ చేయబడ్డాయి. జాతీయ జెండా, “భారత్ మాతా కీ జై” నినాదానికి సంబంధించిన షరతును నిర్ధారించడానికి ఆర్డర్ కాపీని పోలీసు కమిషనర్ (సిపి) భోపాల్‌కు పంపాలని కోర్టు ఆదేశించింది.