జీఎస్ఎల్‌వీ ఎఫ్-10 కౌంట్‌డౌన్ ప్రారంభం
Countdown for launch of EOS-03 satellite commences.భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో గగన విజయానికి
By తోట వంశీ కుమార్
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో గగన విజయానికి సమాయత్తమవుతోంది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి శాటిలైట్ లాంచ్ వెహికల్(జీఎస్ఎల్‌వీ)- ఎఫ్ 10 వాహకనౌక ప్రయోగానికి సంబంధించిన కౌంట్ డౌన్ బుధవారం తెల్లవారుజామున 3.43 గంటలకు ప్రారంభమైంది. ఇది నిరంతరాయంగా 26 గంటలు కొనసాగనుంది. గురువారం ఉదయం 5.43 గంటలకు జీఎస్ఎల్‌వీ వాహకనౌక నింగిలోకి దూసుకుపోనుంది.
జీఎస్‌ఎల్‌వీ ఎఫ్10 (జీఎస్‌ఎల్‌వీ మార్క్2) రాకెట్ ద్వారా 2,268 కిలోల బరువు కలిగిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈవోఎస్–03) అనే ఈ నూతన ఉపగ్రహాన్ని భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని జియో ఆర్బిట్ (భూస్థిర కక్ష్య)లోకి ప్రవేశపెట్టనున్నారు. భూమిని పరిశోధించేందుకు ఇప్పటి దాకా రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ (దూర పరిశీలనా ఉపగ్రహాలు) భూమికి 506 నుంచి 830 కిలో మీటర్లు ఎత్తులో ఉన్న సన్ సింక్రనస్ ఆర్బిట్ (సూర్యానువర్థన ధృవ కక్ష్య)లోకి మాత్రమే పంపించేవారు. ఈసారి ఈవోఎస్–03 అనే రిమోట్ సెన్సింగ్ శాటిలైట్‌ను మొట్టమొదటిసారిగా భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టేవిధంగా ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించారు.
Filling of propellant for the second stage (GS2) of GSLV-F10 has commenced: Indian Space Research Organisation pic.twitter.com/hrVvtNWRGh
— ANI (@ANI) August 11, 2021
ప్రత్యేకతలు ఇవే..
- శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి ఇది 79వ ప్రయోగం.
- జీఎస్‌ఎల్‌వీ రాకెట్ ప్రయోగాల సిరీస్‌లో 14వ ప్రయోగం.
- సొంత క్రయోజనిక్ టెక్నాలజీలో ఇది 8వ ప్రయోగం.
- దేశ భద్రత అవసరాలు, రక్షణ వ్యవస్థకు అనుసంధానం, దేశంలో ఉపద్రవాలు/విపత్తులు సంభవించినపుడు ముందస్తు సమాచారాన్ని తెలుసుకోవడం కోసం ఈవోఎస్–03 రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నారు.
- ఈ ఉపగ్రహంలో మల్టీ–స్పెక్ట్రల్ విజబుల్ అండ్ నియర్–ఇన్‌ఫ్రారెడ్ (6 బాండ్స్), హైపర్–స్పెక్ట్రల్ విజబుల్ అండ్ నియర్–ఇన్‌ఫ్రారెడ్ (158 బాండ్స్), హైపర్–స్పెక్ట్రల్ షార్ట్ వేవ్–ఇన్‌ఫ్రారెడ్ (256 బాండ్స్) పేలోడ్స్‌గా అమర్చారు.
- ఈ ఉపగ్రహం భూమికి 36 వేల కిలోమీటర్లు ఎత్తు నుంచి అత్యంత పవర్‌ఫుల్ కెమెరాలతో 50 మీటర్ల నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో భూమిపై జరిగే మార్పులను ఎప్పటికప్పుడు ఛాయా చిత్రాలను తీసి పంపిస్తుంది. సుమారు 10 సంవత్సరాలు ఈ ఉపగ్రహం తన సేవలను అందిస్తుంది.