భారత్‌లో వెలుగుచూసిన వేరియంట్‌కు కొత్త పేరు.. ఇకపై అలాగే పిలవాలి
Coronavirus strain first found in india named as Delta.భారత్‌లో ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తికి కారణమైన
By తోట వంశీ కుమార్ Published on 1 Jun 2021 8:28 AM IST
భారత్‌లో ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తికి కారణమైన డబుల్ మ్యుటెంట్ వేరియంట్స్‌ను పలు దేశాలు ఇండియన్ స్ట్రైయిన్‌గా పిలుస్తుండడం పట్ల భారత ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో కొత్తగా వెలుగు చూసే కరోనా వైరస్‌లు లేదా వేరియంట్‌లను దేశాల పేర్లతో పిలవకూడదని డబ్ల్యూహెచ్ఓ(ప్రపంచ ఆరోగ్య సంస్థ) సూచించింది. భారత్‌లో వెలుగు చూసిన కరోనా వేరియంట్‌కు డబ్ల్యూహెచ్ఓ నామకరణం చేసింది. 'డెల్టా' గా పేరు పెడుతూ.. డబ్ల్యూహెచ్ఓ ఓ ప్రకటనను విడుదల చేసింది. అంతకముందు గుర్తించిన మరో వేరియంట్‌కు కప్పా గా నామకరణం చేసింది.
భారత్‌లో ప్రస్తుతం కరోనా వ్యాప్తికి బి.1.617 వేరియంట్ కారణం కాగా.. దీనిని తొలిసారిగా గతేడాది అక్టోబరులో గుర్తించారు. దీనికి 'డెల్టా' అని నామకరణం చేశారు. ఇక మరొ వేరియంట్‌కు కప్పా అని పేర్లు పెట్టింది. ప్రస్తుతం ఉన్న శాస్త్రీయ నామకరణాలను నూతన పేర్లు భర్తీ చేయవని చెప్పింది. శాస్త్రీయ నామాలు విలువైన సమాచారం, పరిశోధనలో ఉపయోగపడుతాయంది. అలాగే.. కొవిడ్ కొత్త వేరియంట్ల గుర్తింపు, నివేదిక ఇవ్వడంలో ఏ దేశం నిరాకరించకూడదని తెలిపింది. సార్స్- కోవ్ 2 వైరస్ స్ట్రెయిన్‌లకు పేరు పెట్టడం, వాటిని గుర్తించడం కోసం ఏర్పాటు చేసిన నామకరణ వ్యవస్థలు శాస్త్రీయ పరిశోధనల వాడుకలో ఉంటాయని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది
కొవిడ్ వేరియంట్లను గ్రీక్ ఆల్ఫాబెట్‌లు అయిన ఆల్ఫా, బీటా, గామా తదితర పేర్లతో పిలవాలని డబ్ల్యూహెచ్‌ఓ టెక్నికల్ నిపుణుల బృందానికి చెందిన డాక్టర్ మారియా వాన్ కెర్ఖోవే అన్నారు. ఇవి సాధారణ ప్రజలు సైతం పలకడానికి, చర్చించడానికి సులువుగా ఉంటాయని ఆయన చెప్పారు.