క‌రోనా సెకండ్‌వేవ్‌లో కొత్త ల‌క్ష‌ణాలు ఇవే..

Coronavirus second wave symptoms.దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. తొలి వేవ్‌తో పోలిస్తే సెకండ్ వేవ్‌లో క‌రోనా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 April 2021 2:42 PM IST
corona virus

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. తొలి వేవ్‌తో పోలిస్తే సెకండ్ వేవ్‌లో క‌రోనా పాజిటివ్ కేసులు అధిక‌సంఖ్య‌లో న‌మోదు అవుతున్నాయి. సెకండ్ వేవ్‌లో క‌రోనా వేగంగా వ్యాప్తించ‌డానికి వైర‌స్‌లో ఏర్ప‌డిన ఉత్ప‌రివ‌ర్త‌నాలే కార‌ణ‌మ‌ని డాక్ట‌ర్లు చెబుతున్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో బ్రెజిల్‌, యూకే స్ట్రెయిన్లు అధికంగా కనిపిస్తున్నట్టు చెప్తున్నారు. ఇవి శక్తిమంతంగా ఉండటంవల్లే వేగంగా వ్యాపిస్తున్నాయని, రోగుల్లో వ్యాధి లక్షణాలు కూడా భిన్నంగా ఉన్నాయని అంటున్నారు. సాధార‌ణంగా క‌రోనా లక్షణాలంటే జలుబు, పొడి దగ్గు, కొద్దిగా జ్వరం, ఒళ్లునొప్పులు, అలసట, వాసన, రుచి తెలియకుండా పోవడం.. ఇవే చెప్పేవారు. కానీ.. ఇప్పుడు సెకండ్‌ వేవ్‌లో కరోనా సోకినవారిలో కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయి. మరణాల రేటు తక్కువగానే ఉన్నా ఈసారి కరోనా వల్ల ఆస్ప‌త్రుల్లో చేరుతున్న వారి సంఖ్య అధికంగా ఉంది.

ల‌క్ష‌ణాలు..

పొత్తి క‌డుపులో నొప్పి, జీర్ణాశయ సమస్యలు, వాంతులు, ఆకలి మందగించడం, నీరసం, కీళ్ళనొప్పులు వంటి లక్షణాలు క‌నిపిస్తున్నాయి. జీర్ణవ్యవస్థలో భారీగా ఉండే ఏసీఈ2 గ్రాహకాలకు అతుక్కుని వైరస్‌ తన సంఖ్యను పెంచుకుంటోందన్నారు. ఈ లక్షణాలు కనిపించినవారిలో జ్వరం, దగ్గు వంటి సమస్యలు లేకపోవడాన్ని గమనించారు. పై ల‌క్ష‌ణాలు ఎవ‌రిలోనైనా క‌నిపిస్తే వెంట‌నే పరీక్ష‌లు చేయించుకోవాల‌ని సూచిస్తున్నారు. 80% రోగుల్లో ఎలాంటి లక్షణాలు కనిపించడంలేదని, దీనివల్లనే వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉన్నదని చెప్తున్నారు. నిర్లక్ష్యం చేస్తే వైరస్‌ శరీరంలోని గుండె, కాలేయం, మూత్రపిండాలు, కండ్లకు నష్టం కలిగిస్తుందని హెచ్చరిస్తున్నారు.




Next Story