టీకా మంచిదే..
Corona Vaccination is good. టీకా తీసుకున్న తర్వాత చాలా తక్కువ శాతం మందిలో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవుతోందని వెల్లడించింది.
By తోట వంశీ కుమార్ Published on 22 April 2021 9:13 AM ISTటీకా రెండు డోసులు తీసుకున్న తర్వాత కూడా కొంతమంది కరోనా బారిన పడుతున్న విషయం తెలిసిందే. అంతే కాక టీకావల్ల పెద్దగా ఉపయోగం లేదు అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేడు కేంద్ర ప్రభుత్వం కీలక గణాంకాలు వెలువరించింది. టీకా తీసుకున్న తర్వాత చాలా తక్కువ శాతం మందిలో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవుతోందని వెల్లడించింది.
ఈ నేపధ్యంలో కొవాగ్జిన్ రెండు డోసులూ తీసుకున్న వారిలో 0.04 శాతం మంది కరోనా బారిన పడ్డట్టు తాజాగా వెల్లడైంది. ఇక కోవిషీల్డ్ రెండు డోసులు తీసుకున్న వారిలో 0.03 శాతం మంది కరోనా బారిన పడినట్లు తెలిసింది. ఈ సమాచారాన్ని భారత వైద్య ఆరోగ్య పరిశోధన మండలి ఐసీఎంఆర్ పేర్కొంది. కోవిడ్ టీకా తీసుకున్నాక ప్రతి 10 వేల మందిలో అత్యధికంగా నలుగురు కరోనా బారినపడ్డారని ఐసీఎమ్ఆర్ చీఫ్ రజత్ భార్గవ పేర్కొన్నారు. ఎస్ఏఆర్ఎస్-సీఓవీ-2 (సార్స్-కోవ్-2)కు చెందిన వివిధ రూపాలను కోవాగ్జిన్ ధ్వంసం చేసినట్లు ఐసీఎంఆర్ అధ్యయనంలో వెల్లడైంది. అంతేకాకుండా డబుల్ మ్యుటెంట్ స్ట్రెయిన్‌ను కూడా సమర్థవంతంగా నాశనం చేసినట్లు వెల్లడైంది. యూకే వేరియెంట్, బ్రెజిల్ వేరియెంట్‌లపై కోవాగ్జిన్ సామర్థ్యాన్ని ఐసీఎంఆర్-ఎన్ఐవీ వివరించాయి. డబుల్ మ్యుటెంట్ స్ట్రెయిన్ బి.1.617 సార్స్-కోవ్-2ను మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో గుర్తించినట్లు తెలిపాయి.
93,56,436 మంది భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా తొలి డోసు తీసుకోగా.. కేవలం 4,208 మంది మాత్రమే కరోనా బారిన పడ్డారని గణాంకాలు తెలిపాయి. ఇక 17,37,178 మంది రెండు డోసులు తీసుకోగా.. 695 మందిలో మాత్రమే కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యినట్లు వెల్లడించాయి. అంటే టీకా తీసుకున్న తర్వాత కేవలం 0.04 శాతం మందికి మాత్రమే కరోనా సోకుతున్నట్లు తెలుస్తోంది.
ఇక సీరం ఇన్‌స్టిట్యూట్ అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ టీకాకు సంబంధించిన గణాంకాలు ఇంకా ఆశాజనకంగా ఉన్నాయి. 10,03,02,745 మందికి కొవిషీల్డ్ తొలిడోసు ఇవ్వగా.. 0.02 శాతం అంటే 17,145 మంది మాత్రమే కరోనా బారిన పడ్డారు. ఇక 1,57,32,754 మంది రెండో డోసు తీసుకోగా.. 0.03 శాతం అంటే 5,014 మందిలో కరోనా నిర్ధారణ అయ్యింది.
ఈ గణాంకాలు చూస్తే వ్యాక్సిన్లు సురక్షితమన్న విషయం స్పష్టమవుతోందని ప్రభుత్వం తెలిపింది. పైగా పైన తెలిపిన గణాంకాలు కొవిడ్ రోగులతో కాంటాక్ట్‌లోకి వచ్చిన వైద్యారోగ్య సిబ్బందిని కూడా కలుపుకొని లెక్కించినవని పేర్కొంది. వారిని మినహాయిస్తే టీకా తీసుకున్న వారిలో కొవిడ్ బారినపడుతున్న వారి సంఖ్య చాలా చాలా తక్కువగా ఉంటుందని తెలిపింది. అలాగే ప్రతిఒక్కరూ కరోనాను సమర్థమంతంగా ఎదుర్కోవాలంటే.. టీకా తీసుకోవాలని సూచించింది.