మూడో వేవ్ కు సిద్దమవుతున్న రాష్ట్రాలు..!
Corona Third wave action plan.దేశంలో మూడోవేవ్‌ను సమర్థంగా ఎదుర్కోవడానికి రాష్ర్టాలూ సిద్ధమవుతున్నాయి.
By తోట వంశీ కుమార్ Published on 24 May 2021 8:55 AM ISTదేశంలో ప్రస్తుతం కరోనా సెకండ్ విజృంభిస్తోంది. మొదటి వేవ్‌తో పోలిస్తే రెండో వేవ్‌లో కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండడంతో పాటు మరణాలు కూడా పెద్ద ఎత్తున నమోదు అవుతున్నాయి. రెండో వేవ్‌ను అంచనా వేసి ఉంటే.. సమర్థవంతంగా ఎదుర్కొని ఉండేవాళ్లమన్న భావన వైద్య వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి. ఇక మూడో వేవ్ కూడా పొంచి ఉన్నదన్న హెచ్చరికలు వస్తున్నాయి. ఈ వేవ్‌లో చిన్నారులు ఎక్కువగా ప్రభావానికి లోనయ్యే ప్రమాదం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి.
దేశంలో మూడో వేవ్ ఉద్ధృతి అనివార్యమేనని కేంద్ర ఆరోగ్యశాఖ ఇటీవల స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. సెకండ్‌వేవ్ నుంచి పాఠాలను నేర్చుకొని మూడో దశను ఎదుర్కోవడానికి అందరూ సంసిద్ధంగా ఉండాలని పేర్కొంది. కేసులు ఎక్కువగా ఉన్న 10 రాష్ర్టాల్లోని ప్రభావిత జిల్లాల్లో వైరస్ వ్యాప్తి, పిల్లల్లో నమోదవుతున్న కేసుల సమాచారాన్ని కేంద్రం ప్రత్యేకంగా సేకరించింది. కేసుల సరళిలో గణనీయమైన మార్పులు కనబడితే వెంటనే సమాచారమివ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. సెప్టెంబర్-అక్టోబర్ నాటికి మూడోవేవ్ విరుచుకుపడే ప్రమాదమున్నదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆలోగా పిల్లలకు టీకాలు అందుబాటులోకి వచ్చే అవకాశంలేదని, కొవిడ్-19 నిబంధనలే చిన్నారులకు రక్షణ అని పేర్కొంటున్నారు.
మూడోవేవ్‌ను సమర్థంగా ఎదుర్కోవడానికి రాష్ర్టాలూ సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా మహమ్మారి ముప్పు నుంచి పిల్లలను రక్షించి, యుద్ధప్రాతిపదికన సేవలు అందించేందుకు ఢిల్లీ సర్కార్ ప్రత్యేక కార్యదళాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో పిడియాట్రిక్ కొవిడ్ కేర్ సెంటర్లను కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక మహారాష్ట్ర త్రిముఖ వ్యూహాన్ని సిద్ధం చేసింది. వైద్య వ్యవస్థ బలోపేతం-కఠినంగా కొవిడ్ నిబంధనల అమలు-పరిశ్రమల కార్యకలాపాలకు అడ్డంకులు లేకుండా చూడటం వంటి మూడు సూత్రాలను ప్రధానంగా తీసుకొచ్చింది. అలాగే.. యూపీ, రాజస్థాన్, ఉత్తరాఖండ్ కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి.