ఇక ఇంట్లోనే కరోనా టెస్ట్..!

Corona test at home with CoviHome.క‌రోనా ప‌రీక్ష చేయించుకోవాల‌ని అనుకుంటున్నారా..? అయితే..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 July 2021 5:52 AM GMT
ఇక ఇంట్లోనే కరోనా టెస్ట్..!

క‌రోనా ప‌రీక్ష చేయించుకోవాల‌ని అనుకుంటున్నారా..? అయితే..క‌రోనా పరీక్ష కోసం మీరు ఇక‌పై ఎక్క‌డికి వెళ్లాల్సిన ప‌ని లేదు. సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) హైదరాబాద్ కు చెందిన ప్రొఫెసర్ శివ గోవింద్ సింగ్ 'కోవిహోమ్' అనే కృత్రిమ కోవిడ్ -19 టెస్ట్ కిట్‌ను అభివృద్ధి చేశారు. డాక్ట‌ర్ల స‌హాయం లేకుండా క‌రోనా ప‌రీక్ష చేసుకోవ‌డానికి ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది. కరోనా లక్షణాలు ఉన్నా లేకున్నా కూడా ఈ టెస్టు చేసుకోవచ్చు. కేవలం 30 నిమిషాల్లో రిజల్ట్ వస్తుందట.

ఆర్‌టి-పిసిఆర్ (రివర్స్ ట్రాన్స్‌క్రిప్షన్ పాలిమరేస్ చైన్ రియాక్షన్) లేదా బిఎస్‌ఎల్ 2 ల్యాబ్ సౌకర్యం అవసరం లేకుండానే ఇది ఆర్టీపీసీఆర్ టెస్ట్‌తో సమానంగా ఈ రిజల్ట్ ఉంటుందని ప్రొఫెసర్ శివ గోవింద్ తెలిపారు. అందువల్ల నిపుణుల పర్యవేక్షణ లేకుండా హోమ్ కిట్‌లో పరీక్షగా ఉపయోగించుకునే అవకాశం ఉందని వివరించారు. కోవీహోమ్ టెస్టింగ్ కిట్‌ను డెవ‌ల‌ప్ చేసిన ప‌రిశోధ‌కుల బృందంలో డాక్ట‌ర్ సూర్య‌స్నాట త్రిపాఠి, సుప్ర‌జా ప‌ట్ట‌, స్వాతి మోహంతితో పాటు ఇత‌ర విద్యార్థులు కూడా ఉన్నారు.

ఇక దీని ధర కూడా చాలా చౌకగా ఉంటుందట. ఇప్పటికే ఈ డివైజ్ కోసం పేటెంట్ దాఖలు చేసినట్టు తెలిపారు. కిట్‌ల‌ ఉత్ప‌త్తి కోసం భాగ‌స్వామ్యుల కోసం చూస్తున్నామ‌ని ప్రొఫెస‌ర్ తెలిపారు. కోవిహోమ్ కిట్‌‌తో హైదరాబాద్‌లోని ఈఎస్ఐ మెడిక‌ల్ కాలేజీలో ట్ర‌య‌ల్స్ నిర్వ‌హించారు. కోవిహోమ్ పరీక్షించిన శాంపిల్స్ ఆర్‌టీపీసీఆర్ శాంపిల్స్ పరీక్షలతో పోల్చి చూడగా కిట్ సామర్థ్యం 94.2 శాతం, సున్నితత్వం 91.3 శాతం, నిర్దిష్టత 98.2 శాతం నిర్ధారించింది. ఈ టెస్టింగ్ కిట్ ద్వారా ప్రతీ పరీక్షకు దాదాపు రూ. 400 ఖర్చు అవుతుందన్నారు. అయితే.. పూర్తిస్థాయిలో ఇది అందుబాటులోకి వస్తే రూ. 300 లకు లభించే అవకాశం ఉందన్నారు.

Next Story