దేశంలో మళ్లీ పెరుగుతోన్న కరోనా కేసులు, ఐదుగురు మృతి
ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి అతలాకుతలం చేసిన సంగతి అందరికీ తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 18 Dec 2023 10:54 AM ISTదేశంలో మళ్లీ పెరుగుతోన్న కరోనా కేసులు, ఐదుగురు మృతి
ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి అతలాకుతలం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఎంతో మంది ప్రాణాలను బలితీసుకుంది. ఇంకా కొందరు దీని ప్రభావంతో పూర్తి అనారోగ్యం నుంచి కోలుకోలేకపోతున్నారు. దేశ ఆర్థిక పరిస్థితులను సైతం ప్రభావితం చేసింది. కరోనా మహమ్మారి పూర్తిగా అంతరించిపోవడం లేదు.. ఏదో ఒక రూపంలో తిరిగి వస్తూనే ఉంది. వివిధ వేరియంట్లు ఆయా దేశాల్లోనే కాదు.. ఇండియాలో కూడా వెలుగు చూస్తున్నాయి. దాంతో.. జనాలు కాస్త ఆందోళన చెందుతున్నారు. తాజాగా కోవిడ్ కేసులు దేశంలో మరోసారి పెరుగుతున్నాయి.
దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. ఆదివారం ఒక్కరోజే కొత్తగా 335 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక కరోనా కారణంగా ఐదుగురు ప్రణాలు కోల్పోయారు. చనిపోయినవారిలో నలుగురూ కేరళకు చెందిన వారే కావడం గమనార్మం. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 1,701 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దాంతో.. ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4.50 కోట్లు దాటింది. వీరిలో 4.46 కోట్ల మంది కరోనా చికిత్స తర్వాత కోలుకన్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా వల్ల దేశంలో ఇప్పటి వరకు 5.33 లక్షల మంది మరణించినట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా కరోనా రోగుల రికవరీ రేటు 98.81 శాతంగా తెలిపింది.
కాగా.. కేరళలో ఇటీవల జేఎన్-1 అనే కరోనా కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే పలు దేశాల్లో ఈ వేరియంటో విజృంభిస్తోంది. కేరళలో కూడా వ్యాప్తి చెందుతుందని తెలియడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అంతేకాదు.. ఈ జేఎన్-1 కరోనా వేరియంట్ వల్లే ఉత్తర్ ప్రదేశ్‌లో 73 ఏళ్ల మహిళతో పాటు నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ సూచిస్తోంది.