బీ అలర్ట్.. కరోనా మళ్లీ విజృంభిస్తోంది
కొన్ని రోజులుగా ప్రపంచంలోని అనేక దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నట్టు డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది. దీంతో మరోసారి ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేగింది.
By అంజి Published on 19 Dec 2023 6:06 AM GMTబీ అలర్ట్.. కరోనా మళ్లీ విజృంభిస్తోంది
అప్పట్లో కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలం అంతా ఇంతా కాదు. ఆ మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న ప్రపంచ దేశాలకు ఇది పిడుగు లాంటి వార్తే. కొన్ని రోజులుగా ప్రపంచంలోని అనేక దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నట్టు డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది. దీంతో మరోసారి ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేగింది. భారత్‌లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఆదివారం నాడు ఒక్కరోజే 335 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఐదుగురు మరణించారు. వారిలో నలుగురు కేరళకు చెందిన వారే కావడం గమనార్హం. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య ఆదివారానికి 1701కి చేరింది.
కేరళలో కొవిడ్ కొత్త సబ్ వేరియంట్
ప్రస్తుతం కరోనా కొత్త వేరియంట్ జెఎన్-1ను శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనికి సంబంధించిన తొలికేసును ఈ ఏడాది సెప్టెంబర్‌లో అమెరికాలో గుర్తించగా.. మరో ఏడు కేసులు చైనాలో బయటపడ్డాయి. ఇదే సబ్ వేరియంట్ జేఎన్-1కు చెందిన మొదటి కేసు భారత్‌లోని కేరళలోని తిరువనంతపురంలో నమోదు అయ్యింది. 79 ఏళ్ల మహిళ జేఎన్ - 1 సబ్ వేరియంట్ బారిన పడ్డట్టు తేలింది. ఈ కేసులు ప్రపంచ వ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందుతాయేమో అని డబ్ల్యూహెచ్‌వో ఆందోళన చెందుతోంది.
జేఎన్-1 వేరియంట్ లక్షణాలు
కరోనాకు చెందిన ఈ సబ్ వేరియంట్ జేఎన్-1 ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ 2.86 వంశానికి చెందినదని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్సన్ వెల్లడించింది. జేఎన్ -1, బీఏ.2.86 మధ్య ఒకే మార్పు ఉందని.. అది స్పైక్ ప్రోటీన్‌లోనే కనిపిస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వైరస్ ఉపరితలంపై చిన్న స్పైక్‌ల మాదిరిగా ఇది కనిపిస్తుంది. దీని కారణంగానే ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. జేఎన్-1 లక్షలణాలపై శాస్త్రవేత్తలు విస్తృత పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పటి వరకు దీని లక్షణాలు, తీవ్రతకు సంబంధించి పూర్తి సమాచారం వెల్లడికాలేదు. అయితే సాధారణ కరోనా లక్షణాలే దీనిలోనూ కనిపిస్తాయని అంచనా వేస్తున్నారు. జ్వరం, నిరంతర దగ్గు, త్వరగా అలసట, తీవ్రమైన జలుబు, అతిసారం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాత్రం వైద్యులు సూచిస్తున్నారు.
డబ్ల్యూహెచ్‌వో ఆందోళన.. కేంద్రం అలర్ట్
సింగపూర్, చైనా, అమెరికా, భారత్ సహా పలు దేశాల్లో పెరుగుతున్న కరోనా కేసులపై డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా ప్రోటోకాల్‌ను అనుసరించాలని పలు దేశాలకు సూచించింది. కరోనా ప్రభావిత ప్రాంతాలపై నిఘా ఉంచాలని, పరీక్షలను కొనసాగించాలని ఆయా దేశాలకు విజ్ఞప్తి చేసింది. కొత్తగా కేసులు పెరగడానికి గల కారణాలను విశ్లేషించి కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టాలని తెలిపింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
మెయిన్‌గా కేరళలో కొవిడ్-19 కొత్త వేరియంట్ జేఎన్-1 నిర్దారణ కావడంతో ఇతర రాష్ట్రాలను అలర్ట్ చేసింది. కొత్త కేసుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన చోట కొవిడ్ టెస్టులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించింది. అటు కేరళ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా హెల్త్ అలర్ట్ ప్రకటించింది. కొత్త వేరియంట్ పట్ల ఆందోళన వద్దని తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిపింది. పొరుగున ఉన్న కేరళలో కొత్త వేరియంట్ గుర్తించడంతో కర్నాటక కూడా అప్రమత్తమైంది. ప్రస్తుతం కర్నాటకలో 58 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి.