సనాతన ధర్మం వివాదం.. 'హిందువునని చెప్పుకోవడానికి గర్విస్తున్నానన్న బ్రిటన్ ప్రధాని'
యూకే ప్రధాని రిషి సునక్, అతని భార్య అక్షతా మూర్తి G20 సమ్మిట్ కోసం తన అధికారిక పర్యటన సందర్భంగా ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించారు.
By అంజి
సనాతన ధర్మం వివాదం.. 'హిందువునని చెప్పుకోవడానికి గర్విస్తున్నానన్న బ్రిటన్ ప్రధాని'
యూకే ప్రధాని రిషి సునక్, అతని భార్య అక్షతా మూర్తి G20 సమ్మిట్ కోసం తన అధికారిక పర్యటన సందర్భంగా ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించారు. ఆదివారం ఉదయం ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయానికి చేరుకుని స్వామి నారాయణుడిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రార్థనలు చేశారు. జీ20 సమ్మిట్ రెండో రోజు సదస్సు ప్రారంభం కావడానికి ముందు ఆదివారం ఉదయం 6:30 గంటలకు రిషి సునక్ కాన్వాయ్ ఆలయానికి చేరుకుంది. సద్భావన, విలువలకు ప్రతీకగా ఆలయంలో బ్రిటన్ ప్రధాని దంపతులకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. దీని తర్వాత వారికి సాధువులు స్వాగతం పలికారు. ఆధ్యాత్మిక నాయకుడు రిషి సునక్ శిఖరాగ్ర సమావేశం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. సునక్ దంపతులు నీలకంఠ వర్ణి మహారాజ్ విగ్రహానికి అభిషేకం చేసి ప్రపంచ శాంతి, పురోగతి , సామరస్యం కోసం ప్రార్థించారు.
సునక్, అతని భార్య ఆలయ కళ, వాస్తుశిల్పాన్ని మెచ్చుకున్నారు. బ్రిటన్ ప్రధాని దంపతులకు ప్రాంగణం మొత్తం దగ్గరుండి చూపించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలతోపాటు రిషి సునక్ చేసిన వ్యాఖ్యలను భారతదేశంలోని బ్రిటిష్ హైకమిషన్ ట్విట్టర్‌లో షేర్ చేసింది. "నా భారతీయ మూలాలు, భారతదేశంతో నా సంబంధాల విషయంలో నేను చాలా గర్వపడుతున్నాను. గర్వించదగిన హిందువుగా ఉండటం అంటే నాకు భారతదేశంతో పాటు భారతదేశ ప్రజలతో ఎప్పుడూ అనుబంధం ఉంటుంది" అని రిషి సునక్ వ్యాఖ్యానించారు. తాను హిందువనని చెప్పుకోవడానికి గర్విస్తానంటూ రిషి సునక్ చెప్పారు. కాగా ఇవాళ ఆలయ అధికారులు ఆయనకు ఆలయ నమూనాను కానుకగా అందజేశారు. భారత్ ఆతిథ్యమిస్తున్న G20 సమ్మిట్ కోసం సునక్ న్యూఢిల్లీ వచ్చారు.
ఇదిలా ఉంటే.. ఇటీవల సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి, సినీ నటుడు ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. డెంగీ, మలేరియా మాదిరి సమాజాన్ని వేధిస్తున్న సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలపై గట్టిగా స్పందించాలని తన సహచరులకు ప్రధాని మోదీ సూచించారు. అయితే తాజాగా ఓ దేశ ప్రధానే.. తాను హిందువును అని చెప్పుకోవడానికి గర్వంగా ఉందంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. జీ 20 సమ్మిట్ కోసం భారత్ వచ్చిన బ్రిటన్ ప్రధాని రిషి సునక్ గర్వించదగిన హిందువుగా ఉండటం తనకిష్టమని చెప్పారు. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.