ముస్లింలకు దుప్పట్లు నిరాకరించిన మాజీ బీజేపీ ఎంపీ.. కారణం ఇదే!
రాజస్థాన్‌లోని టోంక్ జిల్లాలో జరిగిన ఒక స్వచ్ఛంద కార్యక్రమంలో మాజీ బీజేపీ ఎంపీ సుఖ్‌బీర్ సింగ్ జౌనాపురియా వ్యవహరించిన తీరు తీవ్ర వివాదానికి దారితీసింది.
By - అంజి |
ముస్లింలకు దుప్పట్లు నిరాకరించిన మాజీ బీజేపీ ఎంపీ.. కారణం ఇదే!
రాజస్థాన్‌లోని టోంక్ జిల్లాలో జరిగిన ఒక స్వచ్ఛంద కార్యక్రమంలో మాజీ బీజేపీ ఎంపీ సుఖ్‌బీర్ సింగ్ జౌనాపురియా వ్యవహరించిన తీరు తీవ్ర వివాదానికి దారితీసింది. పేదలకు ఉచితంగా దుప్పట్లు పంపిణీ చేసే క్రమంలో, ముస్లిం వర్గానికి చెందిన వారికి దుప్పట్లు ఇచ్చేందుకు ఆయన నిరాకరించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో టోంక్-సవాయి మాధోపూర్ నియోజకవర్గం నుండి ఎంపీగా గెలిచిన జౌనాపురియా, ఒక గ్రామంలో తన వ్యక్తిగత స్వచ్ఛంద కార్యక్రమం కింద పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు.
ఈ క్రమంలో అక్కడికి కొంతమంది ముస్లింలు రావడం గమనించిన ఆయన ఒక్కసారిగా అసహనానికి లోనయ్యారు. ముస్లింలకు దుప్పట్లు ఇవ్వవద్దని ఆదేశించడమే కాకుండా, అప్పటికే పంపిణీ చేసిన కొన్ని దుప్పట్లను తిరిగి వెనక్కి తీసుకోవాలని తన అనుచరులను కోరారు. "మోదీని తిట్టే వారికి ఈ దుప్పట్లు పొందే హక్కు లేదు " అని ఆయన బహిరంగంగా వ్యాఖ్యానించారు. తన నిర్ణయం వల్ల ఎవరైనా బాధపడినా తనకు పట్టింపు లేదని ఆయన స్పష్టం చేశారు. ముస్లింలను పిలిచినందుకు తన మద్దతుదారులపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
గ్రామంలోని ఒక వ్యక్తి ఆయన ప్రవర్తనను ప్రశ్నించగా.. ఈ కార్యక్రమం ప్రభుత్వం నిర్వహిస్తున్నది కాదని, తన సొంత ఖర్చుతో చేస్తున్న వ్యక్తిగత కార్యక్రమమని జౌనాపురియా సమాధానమిచ్చారు. ఎవరికి సహాయం చేయాలనేది తన వ్యక్తిగత ఇష్టమని ఆయన తేల్చి చెప్పారు. సుఖ్‌బీర్ సింగ్ జౌనాపురియా గత తొమ్మిదేళ్లుగా పేదల కోసం ఉచిత క్యాంటీన్‌ను నడుపుతున్నారు. ఆయన చేస్తున్న ఈ సామాజిక సేవను గతంలో స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ తన 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రశంసించడం విశేషం. అయితే తాజాగా ఆయన చేసిన ఈ విబజన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.