కొడుకు శవంతో ఎస్పీ ఆఫీసుకు కానిస్టేబుల్.. ఏం జరిగిందంటే..?
Constable’s son drowns in water-filled pit near house.సెలవు ఇవ్వకపోవడంతో ఇంటి వద్ద ఉన్నరెండేళ్ల బాబు చనిపోయాడంటూ
By తోట వంశీ కుమార్ Published on 13 Jan 2023 6:02 AM GMTసెలవు ఇవ్వకపోవడంతో ఇంటి వద్ద ఉన్నరెండేళ్ల బాబు చనిపోయాడంటూ ఓ కానిస్టేబుల్ ఎస్ఎస్పీ ఆఫీసుకి తన కుమారుడి మృతదేహాన్ని తీసుకుని వచ్చాడు. నా భార్య అనారోగ్యంతో ఉంది, రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. వాళ్లని చూసుకోవడానికి ఎవరూ లేరు. అందుకనే దయతలచి సెలవు ఇవ్వండి అని ఓ కానిస్టేబుల్ పై అధికారిని అడుగగా.. అందుకు ఆ అధికారి నిరాకరించాడు. చేసేది లేక కానిస్టేబుల్ విధులకు హాజరు కాగా.. అతడి కుమారుడు మరణించాడు. తాను అబద్దం చెప్పి సెలవు అడగలేదని చెప్పడానికి సాక్ష్యంగా తన కుమారుడి మృతదేహాన్ని తీసుకువచ్చాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.
మథుర ప్రాంతానికి చెందిన సోనూ చౌదరి అతడి భార్య కవిత, రెండేళ్ల కుమారుడు హర్షిత్‌తో కలిసి ఏక్తా కాలనీలో నివాసం ఉంటున్నాడు. సోనూ బైద్పుర్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. డిసెంబర్‌లో కవితకు ఆపరేషన్ జరిగింది. వైద్యులు ఆమెను విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో శస్త్రచికిత్స జరిగిన భార్యను, రెండేళ్ల కుమారుడిని చూసుకునేందుకు సెలవు కావాలని జనవరి 7న పై అధికారులను కోరాడు.
అయితే పై అధికారులు అతడి అభ్యర్థనను తిరస్కరించారు. దీంతో చేసేది లేక సోనూ విధులకు హాజరు అవుతున్నాడు. ఈ క్రమంలో బుధవారం సోను విధులకు హాజరు కాగా.. అనారోగ్యంతో ఉన్న భార్య ఇంట్లోనే ఉంది. వారి కుమారుడు ఆడుకుంటూ ఇంటి నుంచి బయటకు వెళ్లి నీటి గుంటలో పడిపోయాడు. హర్షిత్ ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కవిత చుట్టు పక్కల ఉన్న వారి సాయంతో అంతా వెతికింది. నీటి గుంటలో బాలుడు కనిపించాడు.
వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే బాలుడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. సెలవు ఇవ్వకపోవడంతో ఏం జరిగిందో చెప్పడానికి సాక్ష్యంగా బాబు మృతదేహాంతో ఎస్ఎస్పీ కార్యాలయానికి వెళ్లాడు. స్పందించిన ఎస్పీ ఘటనపై విచారణకు ఆదేశించారు.