పరస్పర అంగీకారంతో శృంగారం.. మహిళపై దాడికి లైసెన్స్ కాదు
ఏకాభిప్రాయంతో కూడిన లైంగిక సంబంధం మహిళపై దాడి చేయడానికి పురుషుడికి లైసెన్స్ అవ్వదని కర్ణాటక హైకోర్టు తీర్పునిచ్చింది.
By అంజి Published on 26 Jan 2025 1:45 PM ISTపరస్పర అంగీకారంతో శృంగారం.. మహిళపై దాడికి లైసెన్స్ కాదు
ఏకాభిప్రాయంతో కూడిన లైంగిక సంబంధం మహిళపై దాడి చేయడానికి పురుషుడికి లైసెన్స్ అవ్వదని కర్ణాటక హైకోర్టు తీర్పునిచ్చింది. లైంగిక, శారీరక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారికి సంబంధించిన కేసులో ఈ తీర్పు వచ్చింది. బి.అశోక్ కుమార్ అనే సర్కిల్ ఇన్స్పెక్టర్, ఒక పోలీసు కానిస్టేబుల్‌ను వివాహం చేసుకున్నారు. 2017 నుండి 2022 వరకు కలిసి ఉన్నారు. నవంబర్ 11, 2021న, ఒక హోటల్లో కుమార్ తనతో బలవంతంగా లైంగిక సంబంధం పెట్టుకున్నాడని, తనపై శారీరకంగా దాడి చేశాడని మహిళ ఆరోపించింది. మరుసటి రోజు, ఆమెను బస్ స్టాప్‌లో వదిలిపెట్టాడు. ఆ తర్వాత ఆమె గాయాలకు చికిత్స పొందడానికి ఆసుపత్రికి వెళ్లింది.
ఆమె పోలీసులకు ఫిర్యాదు చేస్తూ అశోక్ కుమార్ తనను నిర్బంధించి అత్యాచారం చేశాడని, భౌతిక దాడికి పాల్పడ్డాడని, హత్యాయత్నం చేశాడని ఆరోపించారు. ఈ కేసును కొట్టివేయాలంటూ కుమార్ కోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇద్దరూ పరస్పర అంగీకారంతో శృంగార సంబంధం కొనసాగిస్తున్నప్పటికీ, మహిళపై దాడికి అది లైసెన్స్ కాబోదని జస్టిస్ ఎం.నాగప్రసన్న పేర్కొన్నారు. ఫిర్యాదుదారుపై నిందితుడు స్త్రీ ద్వేషంతో కూడిన క్రూరత్వం ప్రదర్శించినట్టు కనిపిస్తోందని అన్నారు. ఏకాభిప్రాయంతో నాలుగేళ్లుగా కొనసాగుతున్న శారీరక బంధాన్ని నేరంగా పరిగణించలేమని, అత్యాచారం ఆరోపణలను అంగీకరించలేమని తేల్చి చెప్పింది. మోసం, హత్యాయత్నం, దాడి, నేరపూరిత బెదిరింపులు వంటి ఆరోపణలకు బలం ఉందని కోర్టు తెలిపింది. విచారణ సందర్భంగా, పోలీసు అధికారిపై కేసును కొట్టివేసేందుకు కర్ణాటక హైకోర్టు నిరాకరించింది.