అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ప్రియాంక గాంధీ

కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ ఆస్పత్రిలో చేరారు.

By Srikanth Gundamalla  Published on  16 Feb 2024 11:16 AM GMT
congress, priyanka gandhi,  hospital,

 అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ప్రియాంక గాంధీ 

కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని స్వయంగా ఎక్స్ వేదికగా ప్రియాంక గాంధీనే వెల్లడించారు. అనారోగ్యంగా ఉండటంతో తాను ఆస్పత్రిలో చేరినట్లు చెప్పారు. ఈ కారణంగా భారత్ జోడో న్యాయ్‌ యాత్రలో పాల్గొనలేకపోతున్నానంటూ పోస్టు చేశారు. ఆరోగ్యం మెరుగుపడిన వెంటనే యాత్రలో పాల్గొంటానని క్లారిటీ ఇచ్చారు.

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఈ యాత్ర శుక్రవారం సాయంత్రం బీహార్ రాష్ట్రం నుంచి ఉత్తర్‌ ప్రదేశ్‌లోనికి ప్రవేశించనుంది. ఈ జోడో యాత్ర యూపీలోకి ప్రవేశించిన తర్వాత చందౌలీలో సోదరుడితో కలిసి ప్రియాంక గాంధీ పాల్గొనాల్సి ఉంది. కానీ.. ఆమెకు అనారోగ్యం కావడంతో ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలోనే షెడ్యూల్ ప్రకారం తాను భారత్ జోడో న్యాయ్‌ యాత్రలో పాల్గొనడం లేదని వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు పెట్టిన ప్రియాంక గాంధీ.. భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర ఉత్తర్‌ ప్రదేశ్‌కు చేరుకోవడం పట్ల ఎంతో ఆసక్తిగా ఎదురుచూశానని చెప్పారు. కానీ.. అనారోగ్యం కారణంగా శుక్రవారమే ఆస్పత్రిలో చేరాల్సి వచ్చిందని వివరించారు. ఆరోగ్యం కుదట పడగానే జోడో యాత్రలో తప్పకుండా పాల్గొంటానని మాట ఇచ్చారు ప్రియాంక గాంధీ. ఇక ఉత్తర్‌ ప్రదేశ్‌లోకి భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర ప్రవేశించిన సందర్భంగా రాహుల్‌గాంధీతో పాటు.. ఇతర కాంగ్రెస్ నాయకులందరికీ ప్రియాంక శుభాకాంక్షలు తెలిపారు.

రాహుల్ గాంధీ భారత జోడో న్యాయ్ యాత్ర శుక్రవారం వారణాసీ మీదుగా ఉత్తరప్రదేశ్‌లోకి ప్రవేశించనుంది. భాదోహి, ప్రయాగ్‌రాజ్, ప్రతాప్‌గఢ్ మీదుగా ఫిబ్రవరి 19న అమేథి లోక్‌సభ నియోజకవర్గానికి చేరుకుంటుంది. నియోజకవర్గంలోని గౌరీగంజ్‌లో బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు. ఇక ప్రియాంక గాంధీ అనారోగ్యానికి గురైన విషయం వెల్లడించారు కానీ.. ఏం జరిగిందనేది మాత్రం చెప్పలేదు.


Next Story