రాహుల్‌ భద్రతపై హోంమంత్రికి కాంగ్రెస్ లేఖ

రాహుల్ గాంధీ భద్రతపై కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాల్లో రాహుల్ భారత్ జోడో న్యాయ యాత్ర కొనసాగుతున్న సంగతి తెలిసిందే

By Medi Samrat  Published on  24 Jan 2024 10:53 AM GMT
రాహుల్‌ భద్రతపై హోంమంత్రికి కాంగ్రెస్ లేఖ

రాహుల్ గాంధీ భద్రతపై కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాల్లో రాహుల్ భారత్ జోడో న్యాయ యాత్ర కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అస్సాం రాజధాని గువాహటిలో పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో రాహుల్ భద్రత వైఫల్యంపై కాంగ్రెస్ నాయకత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ఈ విషయంలో ‌హోంమంత్రి అమిత్ షా జోక్యం చేసుకోవాలని ‎ఖర్గే లేఖలో కోరారు.

కాంగ్రెస్ పోస్టర్లను ధ్వంసం చేయడం, కాంగ్రెస్ యాత్రను బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడం, రాష్ట్ర పార్టీ చీఫ్ భూపెన్ బోరాపై దాడి చేయడం వంటి విషయాలను ఆయన ప్రస్తావించారు. అస్సాం పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాషాయ శ్రేణులకు రాహుల్‌ కాన్వాయ్‌ దగ్గరకు రావడానికి అనుమతించారని విమర్శించారు. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలు పబ్లిక్ డొమైన్‌లో ఉన్నప్పటికీ..ఇంతవరకు పోలీసులు వారెవరినీ అరెస్టు చేయలేదని పేర్కొన్నారు. ఇక ముందు న్యాయయాత్రలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, భద్రత కల్పించేలా అస్సాం ముఖ్యమంత్రి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌లను ఆదేశించాలని అమిత్ షాను కోరారు.

Next Story