హసీనాకు ఆశ్రయమిచ్చి కేంద్రం మంచి పనిచేసింది: శశిథరూర్
బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల కోసం పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 12 Aug 2024 1:30 PM ISTహసీనాకు ఆశ్రయమిచ్చి కేంద్రం మంచి పనిచేసింది: శశిథరూర్
బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల కోసం పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే. ఈ నిరసనల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా ఆ దేశం విడిచిపెట్టారు. ఆమె లండన్‌కు వెళ్లాలని అనుకున్నారు. అక్కడి నుంచి అనుమతులు రాకపోవడంతో షేక్ హసీనా భారత్‌లోనే ఉండిపోయారు. భారత్‌లో షేక్ హసీనా ఆశ్రయం పొందుతుండటంపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
షేక్ హసీనాకు ఆశ్రయం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని శశిథరూర్ ప్రశంసించారు. ఆమెకు ఒకవేళ సాయం చేయకపోయి ఉంటే భారత దేశానికే అవమానం అయ్యేదని అన్నారు. స్నేహితుడితో చెడుగా ప్రవర్తిస్తే మనకు మిత్రులు కావాలని ఎవరూ కోరుకోరు అని చెప్పారు. అయితే.. ఆమె ఇండియాతో మంచి సన్నిహితంగా మెలిగారని గుర్తు చేశారు. భారత ప్రభుత్వం చేసిన పనిని తాను అభినందిస్తున్నట్లు ఎంపీ శశిథరూర్ పేర్కొన్నారు. హసీనాకు భద్రత కల్పించడంలో భారత సర్కార్ తీసకున్న నిర్ణయం సరైనదని ఆయన చెప్పారు.
బంగ్లాదేశ్ ప్రజల శ్రేయస్సు భారత్ తొలి లక్ష్యమని ఎంపీ శశిథరూర్ అన్నారు. బంగ్లాదేశ్ ప్రజలతో ఎప్పుడూ ఉన్నామని పేర్కొన్నారు. 1971లో యద్ధం సమయంలో కూడా అండగా ఉన్నామన్నారు. అక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా భారత్‌తో స్నేహపూర్వకంగానే మెలిగారని ఎంపీ శశిథరూర్ చెప్పారు. రాబోయే కాలంలో ఇరు దేశాల మధ్య బంధంలో ఎలాంటి తగ్గుదల ఉండకూదని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పడిన తాత్కాలిక యూనస్ ప్రభుత్వం.. దేశంలో శాంతి, మైనార్టీల రక్షణ కోసం చర్యలు తీసుకోవాలని శశిథరూరల్ కోరారు.