ఇద్దరు భార్యాలుంటే రూ.2లక్షలు.. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కామెంట్స్

కాంగ్రెస్ మాజీమంత్రి కాంతిలాల్‌ భురియా ఇచ్చిన ఎన్నికల హామీ అందరినీ ఆశ్చర్యపరించింది.

By Srikanth Gundamalla  Published on  10 May 2024 11:56 AM IST
congress, mp candidate, sensational comments, politics,

ఇద్దరు భార్యాలుంటే రూ.2లక్షలు.. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కామెంట్స్ 

దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు విడతల వారీగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మూడు విడతల పోలింగ్ పూర్తయ్యింది. లోక్‌సభ ఎన్నికల్లో ఎలాగైనా మెజార్టీ సీట్లు సాధించాలని ప్రధాన పార్టీలు ముమ్మురంగా ప్రచారం చేస్తున్నాయి. ఆయా పార్టీల నుంచి టికెట్‌ దక్కించుకున్న అభ్యర్థులు కూడా జోరుగా ప్రజల్లో తిరుగుతున్నారు. ప్రజల సమస్యలను పరిష్కరిస్తామంటూ హామీలు ఇస్తున్నారు. అంతేకాదు.. తాము గెలిస్తే ఎలాంటి పథకాలను తీసుకొస్తామనే విషయాలను చెబుతున్నారు. గెలుపు కోసం శాయశక్తులా కృషి చేస్తున్నారు.

స్థానికంగా తిరుగుతున్న పలువురు అభ్యర్థులు గెలుపు కోసం కొన్ని హామీలను సొంతంగానే ఇస్తుంటారు. ఇక కొందరు నాయకులు ఓటర్లను ఆకర్షించే ప్రయత్నంలో విచ్చలవిడి హామీలను ఇస్తుంటారు. కొన్ని సందర్భాల్లో అదుపుకోల్పోయి ఏదో మాట్లాడేస్తుంటారు. తాజాగా ఓ కాంగ్రెస్‌ అభ్యర్థి చేసిన కామెంట్స్‌ వివాదాస్పదంగా మారాయి.

మధ్యప్రదేశ్‌లోని రత్లాం లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి, కాంగ్రెస్ మాజీమంత్రి కాంతిలాల్‌ భురియా ఇచ్చిన ఎన్నికల హామీ అందరినీ ఆశ్చర్యపరించింది. పలువురు ఓటర్లు ఆయన చేసిన కామెంట్స్‌ను వ్యతిరేకిస్తున్నారు. ప్రత్యర్థి అభ్యర్థులు అయితే.. కాంతిలాల్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గురువారం సైలానాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంతిలాల్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తుందని చెప్పారు. ఆ డబ్బులను నేరుగా మహిళల అకౌంట్లలోనే వేస్తామని కాంతిలాల్ చెప్పారు.

అయితే.. ఇద్దరు భార్యలు ఉన్న వ్యక్తికి ఈ పథకం మరింత లాభం చేకూరుస్తుందని కాంతిలాల్‌ అన్నారు. ఈ పథకం కింద ఇద్దరు భార్యలు ఉంటే ఏకంగా రూ.2లక్షలు పొందుతారంటూ వివాదాస్పద కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో మహాలక్ష్మి పథకం కింద ఏటా ప్రతి మహిళ ఖాతాలో రూ.లక్ష జమ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని చెప్పారు. ఇద్దరు భార్యలు ఉంటే ఇరువరికీ చెరో లక్ష అంటే రూ.2లక్షలు వస్తాయని కాంతిలాల్‌ పేర్కొన్నారు. యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉండగా కేంద్రమంత్రిగా పనిచేసిన కాంతిలాల్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల బీజేపీ అగ్రనేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

Next Story