సైకిల్‌పై గ్యాస్ సిలిండర్‌తో పోలింగ్ బూత్‌కు వ‌చ్చిన‌ కాంగ్రెస్ ఎమ్మెల్యే

Congress MLA reaches polling booth with gas cylinder on bicycle.గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల తొలి విడత పోలింగ్ గురువారం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Dec 2022 11:54 AM IST
సైకిల్‌పై గ్యాస్ సిలిండర్‌తో పోలింగ్ బూత్‌కు వ‌చ్చిన‌ కాంగ్రెస్ ఎమ్మెల్యే

గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల తొలి విడత పోలింగ్ గురువారం ఉద‌యం ప్రారంభ‌మైంది. 19 జిల్లాల ప‌రిధిలోని 89 నియోజ‌క‌వ‌ర్గాల్లో పోలింగ్ కొన‌సాగుతోంది. స్వ‌ల్ప ఉద్రిక‌త్త‌లు మిన‌హా పోలింగ్ ప్ర‌శాంతంగా జ‌రుగుతోంది. మొత్తం 788 మంది అభ్య‌ర్థులు బ‌రిలో ఉండ‌గా.. 2,39,76,760 మంది ఓట్ల‌రు ఓటు వేయ‌నున్నారు.

త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకునేందుకు ప్ర‌జ‌లు ఉద‌యం నుంచే పోలింగ్ కేంద్రాల వ‌ద్ద బారులు తీరారు. ఉద‌యం 9 గంట‌ల వ‌ర‌కు 4.92 శాతం ఓటింగ్ న‌మోదు అయిన‌ట్లు అధికారులు తెలిపారు. సాయంత్రం 5 గంట‌లకు పోలింగ్ ముగియ‌నుంది. ఇప్ప‌టికే ప‌లువురు ప్ర‌ముఖులు ఓటు వేశారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్ మంగూభాయ్ ప‌టేల్ దంప‌తులు, గుజ‌రాత్ మాజీ ముఖ్య‌మంత్రి విజ‌య్ రూపానీ దంప‌తులు, క్రికెట‌ర్ ర‌వీంద్ర జ‌డేజా స‌తీమ‌ణి, బీజేపీ అభ్య‌ర్థి రీవాబాల‌తో పాటు ప‌లువురు మంత్రులు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. అయితే, కాంగ్రెస్ ఎమ్మెల్యే పరేష్ ధనాని మాత్రం అందరి దృష్టిని ఆకర్షించారు.

ఆమ్రేలిలో ఓటు వేసేందుకు పోలింగ్ బూత్ వ‌ద్ద‌కు సైకిల్‌పై వంట‌గ్యాస్ సిలిండ‌ర్ క‌ట్టుకుని త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి వ‌చ్చారు. పెరుగుతున్న‌ ఇంధన ధరల సమస్యను హైలైట్ చేయడానికి పరేష్ ధనాని ఇలా చేసాడు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎల్పీజీ సిలిండర్‌ ధరలు భారీగా పెరిగాయని దానిపై రాశారు. గ్యాస్‌తోపాటు నిత్యావసర వస్తువుల ధరల పెంపు, నిరుద్యోగంపై బీజేపీని నిందించిన పరేష్ ధనాని గ్యాస్ సిలిండరుతో పోలింగ్ కేంద్రానికి రావడం ఓటర్లను ఆకట్టుకుంది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Next Story