కాంగ్రెస్ చీఫ్ ఖర్గేకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు భద్రతను పెంచింది కేంద్ర ప్రభుత్వం.
By Srikanth Gundamalla Published on 23 Feb 2024 8:06 AM ISTకాంగ్రెస్ చీఫ్ ఖర్గేకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు భద్రతను పెంచింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు ఖర్గేకు జెడ్-ప్లస్ కేటగిరి భద్రత కల్పిస్తున్నట్లు గురువారం కేంద్ర హోంశాఖ ఆదేశాలను జారీ చేసింది. ఆయన భద్రతకు ఉన్న ముప్పును పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లో పేర్కొంది. ఇక మల్లికార్జున ఖర్గే దేశంలో ఎక్కడికి వెళ్లినా సీఆర్‌పీఎఫ్ జవాన్లు వెన్నంటే ఉండనున్నారు. దేశంలో రానున్న కొద్ది నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఖర్గే దేశంలో పర్యటించనున్నారు. ఈ క్రమంలోనే భద్రతా చర్యల్లో భాగంగా ఖర్గేకు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని ఏర్పాటు చేసింది కేంద్ర హోంశాఖ.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఖర్గే పర్యటనలు ఉంటాయనీ.. అందుకే భద్రతను పెంచినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇకపై మల్లికార్జున ఖర్గేకు 24 గంటల పాటు మూడు షిఫ్టుల్లో 30 మంది సీఆర్‌పీఎఫ్ కమాండోలు రక్షణగా ఉంటారని వెల్లడించారు. అంతేకాదు.. బుల్లెట్ ప్రూఫ్ వాహనం, పైలట్, ఎస్కార్ట్ వాహనాన్ని సమకూరుస్తున్నారు ఉన్నతాధికారులు. దేశంలోనే అత్యంత భద్రత జెడ్ ప్లస్ కేటగిరి. అధిక ముప్పు ఉన్న వారికి ఈ కేటగిరి భద్రతను కల్పిస్తుంది కేంద్ర ప్రభుత్వం. జెడ్ ప్లస్ తర్వాత ఎక్స్, వై కేటగిరి భద్రతలు ఉంటాయి.