శబరిమలలో రద్దీ.. దర్శనం కాకుండానే భక్తుల తిరుగుపయనం
కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. రద్దీ భారీగా ఉండటంతో గంటల కొద్దీ క్యూలో వేచి ఉన్న అయ్యప్ప దర్శనం కావడం లేదు.
By అంజి Published on 13 Dec 2023 8:23 AM ISTశబరిమలలో రద్దీ.. దర్శనం కాకుండానే భక్తుల తిరుగుపయనం
కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. రద్దీ భారీగా ఉండటంతో గంటల కొద్దీ క్యూలో వేచి ఉన్న అయ్యప్ప దర్శనం కావడం లేదు. ఈ క్రమంలోనే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు స్వామి వారి దర్శనం కాకుండానే వెనుదిరుగుతున్నట్టు తెలుస్తోంది. శబరిమలలో యాత్రికుల రద్దీ అదుపు తప్పుతున్న నేపథ్యంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బుకింగ్ లేకుండా శబరిమలలోకి ఎవరినీ అనుమతించరాదని హైకోర్టు దేవస్వం ధర్మాసనం ఆదేశించింది. వర్చువల్ బుకింగ్, స్పాట్ బుకింగ్ లేకుండా ఎవరూ శబరిమలకు ప్రయాణించకూడదని కోర్టు కోరింది.
శబరిమల వద్ద భక్తులకు సహాయం చేసేందుకు సమీపంలోని కళాశాలల ఎన్‌ఎస్‌ఎస్ ఎన్‌సిసి క్యాడెట్‌ల సహాయాన్ని కోరాలని దేవస్వం బోర్డును హైకోర్టు ఆదేశించింది. నీలక్కల్, పంపా భక్తులతో రద్దీగా మారింది. కొండ ఎక్కలేక భక్తులు వెనుతిరుగుతున్నారు. రద్దీ నియంత్రించేందుకు పోలీసులు, టీడీబీ తాళాలు వేయడంతో యాత్రికులు శబరిమలలోకి ప్రవేశించకుండానే తిరిగి వస్తున్నారు. శబరిమలకు వచ్చే భక్తుల రద్దీని నియంత్రించేందుకు తీసుకున్న పేలవమైన క్రౌడ్ మేనేజ్‌మెంట్ చర్యలు చాలా మంది యాత్రికులను తమ తీర్థయాత్రను పూర్తి చేయకుండానే ఇంటికి తిరిగి వచ్చేలా చేసింది.
తమిళనాడు, కర్ణాటక, కేరళలోని వివిధ ప్రాంతాల నుండి అనేక మంది యాత్రికులు కొండ పుణ్యక్షేత్రాన్ని సందర్శించకుండా ఇంటికి తిరిగి వస్తున్నారు. శబరిమల వద్ద రద్దీ అదుపు తప్పడంతో పందళంలోని వలియా కోయిక్కల్ శ్రీ ధర్మ శాస్తా ఆలయాన్ని సందర్శించి చాలా మంది ఇంటికి తిరిగి వెళ్తున్నారు. ట్రావెన్‌కోర్ దేవస్వోమ్ బోర్డ్, కేరళ పోలీసులు రద్దీని నియంత్రించడంలో వైఫల్యం చెందినట్టు కనిపిస్తోంది. వర్చువల్ క్యూలలో కాకుండా 5,000-6,000 మంది యాత్రికులను ఆలయంలోకి అనుమతించిన దేవస్వం బోర్డు ఇప్పుడు స్పాట్ బుకింగ్‌లలో ఐదు రెట్లు ఎక్కువ మందిని చేర్చుకుంటోందని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. రోజుకు లక్ష మందికిపైగా భక్తులు శబరిమలకు రావడం వల్ల తీవ్ర రద్దీ ఏర్పడిందని కేరళ దేవాదాయశాఖ మంత్రి కె.రాధాకృష్ణన్ తెలిపారు. ఇలాంటి సందర్భాల్లో సమస్యలు తలెత్తడం సాధారణమేనని వ్యాఖ్యానించారు.