దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికి కేరళ రాష్ట్రంలో మాత్రం ఆందోళనకర స్థాయిలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు రెండు రోజుల పాటు సంపూర్ణ లాక్‌డౌన్‌ను విధిస్తున్నట్లు తెలిపింది. ఈ నెల 31, ఆగస్ట్ 1 తేదీల్లో రెండు రోజుల పాటు లాక్‌డౌన్ అమలులో ఉంటుందని స్పష్టం చేసింది.
మిగతా రాష్ట్రాల్లో రోజువారీగా వందల్లో కొవిడ్ కేసులు నమోదవుతుంటే.. కేరళలో మాత్రం నిత్యం 10 వేలకు పైగా కేసులు బయటపడుతున్నాయి. మంగళ, బుధవారాల్లో వరుసగా 20వేలకు పైగా పాజిటివ్ కేసులు అయ్యాయి. దేశంలో నమోదైన కేసుల్లో దాదాపు సగం కేసులు కేరళలోనే ఉన్నాయి. బుధవారం కొత్తగా 22,056 కరోనా కేసులు, 131 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 33,27,301కు పెరగ్గా.. ఇందులో 31,60,804 మంది కోలుకున్నారు. మరణాల సంఖ్య 16,457కు చేరింది. ప్రస్తుతం 1,49,534 యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది.
ఈ నేపథ్యంలో ఆరాష్ట్రంలో కరోనా పరిస్థితులను పర్యవేక్షించేందుకు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్‌కు చెందిన ఆరుగురు సభ్యుల బృందాన్ని కేంద్రం కేరళకు పంపనుంది. వైరస్ పై అక్కడి ప్రభుత్వం జరుపుతున్న పోరులో ఈ బృందం సహకరించనుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు.