మాజీ సీఎంపై పోక్సో కేసు ఫైల్‌ చేసిన మహిళ మృతి

మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ కేంద్ర పార్లమెంటరీ కమిటీ సభ్యుడు బీఎస్‌ యడ్యూరప్పపై పోక్సో కేసు నమోదు చేసిన ఫిర్యాదుదారురాలు మృతి చెందినట్లు పోలీసులు సోమవారం తెలిపారు.

By అంజి  Published on  27 May 2024 3:15 PM GMT
POCSO case, ex CM Yediyurappa, Bengaluru

మాజీ సీఎంపై పోక్సో కేసు ఫైల్‌ చేసిన మహిళ మృతి 

మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ కేంద్ర పార్లమెంటరీ కమిటీ సభ్యుడు బీఎస్‌ యడ్యూరప్పపై పోక్సో కేసు నమోదు చేసిన ఫిర్యాదుదారురాలు మృతి చెందినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. ఫిర్యాదుదారురాలు అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఆదివారం రాత్రి ఆసుపత్రిలో మరణించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఆమె ప్రాణాంతక వ్యాధితో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమె కుటుంబ సభ్యుల వాంగ్మూలాలను పోలీసులు ఇంకా నమోదు చేయలేదు. లోక్‌సభ ఎన్నికలకు ముందు బెంగళూరులోని సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌లో యడ్యూరప్పపై పోక్సో చట్టం, ఐపిసి సెక్షన్ 354 (ఎ) కింద కేసు నమోదైంది. ఈ పరిణామం రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించింది.

ఫిబ్రవరి 2న తన కుమార్తెతో కలిసి యడియూరప్పను కలిసేందుకు ఆయన నివాసానికి వెళ్లగా, యడ్యూరప్ప తన కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం వివిధ పోలీసు అధికారులు, అధికారులపై ఆమె 50కి పైగా ఫిర్యాదులు చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఫిర్యాదుదారుకు అధికారులు, పలుకుబడి ఉన్న వ్యక్తులపై కేసులు పెట్టే అలవాటు ఉందని పోలీసులు ఆరోపించారు. తల్లీ కూతుళ్లు తన వద్దకు వచ్చి సహాయం కోరారని యడ్యూరప్ప స్పష్టం చేశారు. అయితే తన కుమార్తెకు అన్యాయం జరిగిందని, తనకు న్యాయం చేయాలని ఆ మహిళ ఆరోపించింది. ఈ కేసుపై సదాశివనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story