Ayodhya Ram Mandir: రేపటి నుంచి భక్తులకు దర్శనం.. ఆలయ విశేషాలివే
అయోధ్యలో నేడు బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఈ క్రమంలోనే రేపటి నుంచి సాధారణ భక్తులకు స్వామి వారి దర్శనం కల్పించనున్నారు.
By అంజి Published on 22 Jan 2024 7:38 AM IST
Ayodhya Ram Mandir: రేపటి నుంచి భక్తులకు దర్శనం.. ఆలయ విశేషాలివే
అయోధ్యలో నేడు బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఈ క్రమంలోనే రేపటి నుంచి సాధారణ భక్తులకు స్వామి వారి దర్శనం కల్పించనున్నారు. కాగా ఆలయాన్ఇన ఉదయం 7 గంటల నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు తెరిచి ఉంచనున్నారు. నిత్యం మూడు సార్లు ప్రత్యేక హారతి నిర్వహిస్తారు. ప్రాణ ప్రతిష్ఠను పురస్కరించుకొని ఇవాళ సాయంత్రం అయోధ్య నగరంలో 10 లక్షల దీపాలను ఏకకాలంలో వెలిగించనున్నారు.
ఇదిలా ఉంటే.. అయోధ్య రామ మందిరంలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని మంగళ ధ్వని మధ్య నిర్వహించనున్నారు. ఇందు కోసం వివిధ రాష్ట్రాల నుంచి 50 సంగీత వాయిద్యాలను ఒకే వేదికపైకి తీసుకురానున్నారు. వీటిలో ఏపీ నుంచి ఘటం, తమిళనాడు నుంచి నాదస్వరం, మృదంగం, కర్ణాటక నుంచి వీణ ఉన్నాయి. ఉదయం 10 గంటల నుంచి రెండు గంటల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో పలువురు సంగీత విద్వాంసులు పాల్గొంటారు.
రామ మందిరం విశేషాలు..
- రామ మందిరంలో ప్రతిష్ఠించే విగ్రహం ఎత్తు 51 అంగుళాలు
- విగ్రహ రూపకర్త అరుణ్ యోగిరాజ్ (కర్ణాటక)
- మూడు అంతస్తుల్లో నాగర శైలిలో ఆలయ నిర్మాణం
- గ్రౌండ్ ఫ్లోర్‌లో ప్రాణ ప్రతిష్ఠ
- మందిరం కొలతలు.. 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తు
- ప్రతి అందస్తు 20 అడుగుల ఎత్తు. ఆలయంలో 392 స్తంభాలు, 44 గేట్లు ఏర్పాటు
మరోవైపు అయోధ్య రాముల వారికి భారీగా కానుకలు వచ్చి చేరాయి. కన్నౌజ్ నుంచి పరిమళాలు, అమరావతి నుంచి కుంకుమ, ఢిల్లీ నుంచి నవ ధాన్యాలు, భోపాల్ నుంచి పూలు వచ్చాయి. దీంతో పాటు 108 అడుగుల అగర్‌బత్తి, 2,100 కిలోల గంట, 1,100 కిలోల దీపం, బంగారు పాదరక్షలు, 10 అడుగుల ఎత్తైన తాళం, 8 దేశాల సమయాన్ని సూచించే గడియారం బహుమతులుగా వచ్చి చేరాయి. నేపాల్‌లోని సీతాదేవి జన్మస్థలి నుంచి వేల సంఖ్యలో బహుమతులు వచ్చి చేరాయి.