BIG BREAKING: భారీగా పెరిగిన కమర్షియల్‌ సిలిండర్‌ ధర

మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు, పెరుగుతున్న ముడిచమురు ధరల ప్రభావం సామాన్యుడిపై గట్టిగానే పడుతోంది.

By -  అంజి
Published on : 1 April 2026 6:37 AM IST

Commercial LPG, Domestic LPG, Price Hike, Crude Oil Prices, Middle East Conflict, Oil Marketing Companies

BIG BREAKING: భారీగా పెరిగిన కమర్షియల్‌ సిలిండర్‌ ధర 

మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు, పెరుగుతున్న ముడిచమురు ధరల ప్రభావం సామాన్యుడిపై గట్టిగానే పడుతోంది. ఏప్రిల్ 1వ తేదీ బుధవారం నుంచి వాణిజ్య అవసరాలకు వినియోగించే (Commercial) ఎల్పీజీ సిలిండర్ ధరను భారీగా రూ. 195.50 పెంచుతూ ప్రభుత్వ రంగ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర ప్రస్తుతం రూ. 2,078.50కి చేరింది. గత మార్చి 1వ తేదీన కూడా ఈ సిలిండర్‌పై రూ. 114.5 పెరిగిన సంగతి తెలిసిందే.

మరోవైపు, గృహ అవసరాలకు వినియోగించే వంటగ్యాస్ (Domestic LPG) ధరల్లో ఎటువంటి మార్పు లేదు. గత మార్చి 7న 14.2 కిలోల సిలిండర్‌పై రూ. 60 పెరిగిన తర్వాత, ప్రస్తుతం ఆ ధరలే కొనసాగుతున్నాయి. ఢిల్లీలో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర రూ. 913 వద్దే స్థిరంగా ఉందని వార్తా సంస్థ పిటిఐ (PTI) పేర్కొంది. సాధారణంగా ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి సంస్థలు అంతర్జాతీయ మార్కెట్ ధరలు, ఎక్స్ఛేంజ్ రేట్లను బట్టి ప్రతి నెల ఒకటో తేదీన ఈ ధరలను సవరిస్తుంటాయి.

ప్రస్తుతం అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా ఇంధన సరఫరా వ్యవస్థలకు అంతరాయం ఏర్పడి, అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు దాదాపు 50 శాతం మేర పెరిగాయి. దీని ప్రభావం గ్యాస్ ధరలపై పడుతున్నప్పటికీ, పెట్రోల్ మరియు డీజిల్ ధరలు మాత్రం గత కొంతకాలంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. గతేడాది మార్చిలో లీటరుకు రూ. 2 తగ్గించిన తర్వాత పెట్రోల్ ధరల్లో మార్పు రాలేదు. ప్రస్తుతం ఢిల్లీలో లీటరు పెట్రోల్ రూ. 94.72 ఉండగా, డీజిల్ రూ. 87.62 వద్ద కొనసాగుతోంది.

Next Story