గ్యాస్ సిలిండర్ల ధరలు ఇప్పటికే ఆకాశనంటుతున్నాయి. తాజాగా వినియోగదారులకు షాక్ ఇస్తూ.. కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర మరోసారి పెరిగింది. ఈ సారి కమర్షియల్ గ్యాస్ ధరను రూ.105 పెంచాయి చమురు సంస్థలు. పెరిగిన ధరలు నేటి నుండి అమల్లోకి వస్తాయని ఆయా వ్యాపార సంస్థలు తెలిపాయి. మార్చి 1 నుంచి ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.105 పెరిగింది. ఈ పెంపుతో మంగళవారం నుంచి ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,012గా ఉంది.
5 కిలోల సిలిండర్ ధర కూడా 27 రూపాయలు పెరిగింది. ఇప్పుడు ఢిల్లీలో 5 కిలోల సిలిండర్ ధర 569 రూపాయలు. అయితే చమురు సంస్థలు ఇంట్లో వినియోగించే డొమెస్టిక్ ఎల్‌పిజి సిలిండర్ ధరలను పెంచలేదు. ఎల్పీజీ సిలిండర్ ధరలు భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు నెలవారీగా సవరించబడతాయి. నేషనల్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఫిబ్రవరి 1న 19 కిలోల కమర్షియల్ ఎల్‌పిజి సిలిండర్ల ధరలను రూ.91.50 తగ్గించాయి. ఈ సారి మాత్రం ధరలను మరింత పెంచారు.