భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
వాణిజ్య ఎల్‌పిజి సిలిండర్ల ధరలను ఆదివారం నుంచి రూ.209 పెంచినట్లు చమురు మార్కెటింగ్ వర్గాలు తెలిపాయి.
By అంజి Published on 1 Oct 2023 2:59 AM GMTభారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) లక్షలాది మంది వినియోగదారులకు బిగ్ షాక్ ఇచ్చాయి. వాణిజ్య ఎల్‌పిజి సిలిండర్ల ధరలను ఆదివారం నుంచి రూ.209 పెంచినట్లు చమురు మార్కెటింగ్ వర్గాలు తెలిపాయి. కమర్షియల్ సిలిండర్ ధరలను గతకొన్ని నెలలుగా 10, 20 రూపాయల మేర తగ్గిస్తూ వస్తున్న కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఒక్కసారిగా రూ.200 కుపైగా పెంచింది. దీని ఫలితంగా, న్యూఢిల్లీలో అక్టోబర్ 1 నుండి 19 కిలోల వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధర ఇప్పుడు రూ. 1,731.50 అవుతుంది. కోల్‌కతాలో రూ.1839.50, చెన్నైలో రూ.1898, ముంబైలో రూ.1684గా ఉన్నది. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని దేశీయ చమురు కంపెనీలు ప్రకటించాయి.
గృహ వినియోగదారులకు మాత్రం ధరల పెరుగుదల నుంచి ఊరటలభించింది. గృహ గ్యాస్ సిలిండర్ ధరల్లో ప్రస్తుతానికి ఎలాంటి మార్పులేదని కంపెనీలు ప్రకటించాయి. చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను సెప్టెంబర్ 1 నుండి గణనీయంగా రూ.158 తగ్గించిన ఒక నెల తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్‌లో దేశ రాజధాని ఢిల్లీలో వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.1,522గా ఉండేది. ఆగస్టులో దేశవ్యాప్తంగా ఉన్న కనెక్షన్ హోల్డర్లందరికీ దేశీయ ఎల్‌పిజి సిలిండర్ ధరలను కేంద్రం రూ. 200 తగ్గించిన ఒక నెల తర్వాత వాణిజ్య ఎల్‌పిజి సిలిండర్ల ధరలలో తాజా పెంపు కూడా వచ్చింది.
వాణిజ్య, గృహ ఎల్‌పీజీ (ద్రవీకృత పెట్రోలియం గ్యాస్) సిలిండర్ల ధరలు నెలవారీ కొకసారి.. ప్రతి నెల మొదటి రోజున మారుతూ ఉంటాయి. అంతకుముందు ఆగస్టులో కూడా వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను చమురు మార్కెటింగ్ కంపెనీలులు రూ.99.75 తగ్గించాయి.