'ఫిబ్రవరి 14లోగా విద్యార్థినిలకు బాయ్‌ఫ్రెండ్స్ ఉండాలి'.. వివాదం రేపుతోన్న కాలేజీ నోటీసు
College notice makes it mandatory for girls to have boyfriends by valentines day. ఒడిశాలోని ఓ కళాశాల ఫిబ్రవరి 14లోగా అమ్మాయిలకు బాయ్‌ఫ్రెండ్‌ను
By అంజి Published on 25 Jan 2023 2:17 PM ISTఒడిశాలోని ఓ కళాశాల ఫిబ్రవరి 14లోగా అమ్మాయిలకు బాయ్‌ఫ్రెండ్‌ను కలిగి ఉండడాన్ని తప్పనిసరి చేస్తూ నోటీసు జారీ చేయడం కలకలం రేపింది. అయితే ఈ నోటీసును తాను జారీ చేయలేదని, ఇది నకిలీదని కళాశాల ప్రిన్సిపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వాలెంటైన్స్ డే నాటికి విద్యార్థినులందరూ తప్పనిసరిగా బాయ్‌ఫ్రెండ్‌లను కలిగి ఉండాలనే వింత సర్క్యులర్ ఒడిశాలోని ఓ కళాశాల వెలుగులోకి వచ్చింది. స్వామి వివేకానంద మెమోరియల్ (SVM) అటానమస్ కాలేజ్ నుండి అందర్నీ ఆశ్చర్యపరిచే నోటీసు జారీ చేయబడింది.
"ఫిబ్రవరి 14 నాటికి అందరు అమ్మాయిలు కనీసం ఒక బాయ్‌ఫ్రెండ్‌ని కలిగి ఉండాలి. భద్రతా ప్రయోజనాల కోసం ఇది జారీ చేయబడింది. ఒంటరిగా ఉన్న అమ్మాయిలను కళాశాల ఆవరణలోకి అనుమతించరు. వారు తమ బాయ్‌ఫ్రెండ్‌తో ఇటీవలి దిగిన ఫొటోను చూపించవలసి ఉంటుంది. ప్రేమను పంచండి" అంటూ ప్రిన్సిపాల్ సంతకంతో కూడిన నోటీసు కాలేజీలో వైరల్‌గా మారింది. అయితే కొద్దిసేపటికే విద్యార్థుల్లో వైరల్‌గా మారిన నోటీసు నకిలీదని తేలింది. నోటీసుపై ఎస్వీఎం అటానమస్ కళాశాల ప్రిన్సిపాల్ సంతకం చేసినట్లు తెలుస్తోంది. అయితే తాను అలాంటి నోటీసులేవీ ఇవ్వలేదని ప్రిన్సిపాల్ స్పష్టం చేశారు.
ఈ నోటీసుపై కళాశాల అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. కాలేజీ ప్రిన్సిపాల్ విజయ్ కుమార్ పాత్రా జగత్‌సింగ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో నకిలీ నోటీసుపై లిఖితపూర్వక ఫిర్యాదు కూడా చేశారు. విజయ్ కుమార్ పాత్రా మాట్లాడుతూ.. ''ఫిబ్రవరి 14 వరకు అమ్మాయిలందరికీ బాయ్‌ఫ్రెండ్స్ ఉండాలని, కాలేజీలో సర్క్యులేట్ చేయడం ఫేక్. నేను అలాంటి నోటీసులేమీ ఇవ్వలేదు. కొందరు దుర్మార్గులు ఈ పని చేశారు. నోటీసులో ఉన్నది నా నకిలీ సంతకం. పైగా అందులో అధికారిక సంఖ్య ఏదీ లేదు, అది నకిలీదని రుజువు చేస్తుంది. నేను ఈ సమస్యపై జగత్‌సింగ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాను'' అని చెప్పారు.