హాస్యభరితమైన విషయాలు వెల్లడించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
CNN Presidential Town Hall with Joe Biden. జో బైడెన్,శ్వేతసౌధం పరిసరాలకు ఇంకా అలవాటు పడలేనట్లుగా ఉంది. ఇటీవల సీఎన్‌ఎన్ టౌన్ హాల్ సమావేశం సందర్బంగా ఈ సంగతిని ఆయన హాస్యభరితంగా వెల్లడించారు.
By Medi Samrat Published on 18 Feb 2021 2:34 AM GMT
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పదవి బాధ్యతలు చేపట్టి నాలుగు వారాలు కావస్తున్నా.. శ్వేతసౌధం పరిసరాలకు ఇంకా అలవాటు పడలేనట్లుగా ఉంది. ఇటీవల సీఎన్‌ఎన్ టౌన్ హాల్ సమావేశం సందర్బంగా ఈ సంగతిని ఆయన హాస్యభరితంగా వెల్లడించారు. 1600 పెన్సిల్వేనియా ఎవెన్యూలో ఉన్న శ్వేతసౌధంలో రోజూ ఉదయాన్నే లేచిన వెంటనే నా సతీమణి 'జిల్‌ను మనం ఎక్కడున్నాం' అని అడుగుతాను అంటూ జోక్ వేశారు. బైడెన్ అధ్యక్షుడయ్యే వరకు విల్మింగ్టన్‌లోని విశాలమైన స్వగృహంలో నివసిస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన నివాసమున్న 80 ఎకరాల భవనం కూడా ఈత, వ్యాయామం వంటి పనులు చేసుకునేందుకు వీలుగా ఏకాంతంగా ఉండేదని ఆయన అన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందని అన్నారు. తనకు మేళకువ వచ్చేటప్పటికే వైట్ హౌస్ సిబ్బంది లేచి ఉండటం, కోట్ ధరించేందుకు కూడా వారు సహకరించడం, తనకు రక్షణగా ఓ చిన్న సైజు సైన్యమే సిద్ధంగా ఉండటం వంటివి కొత్తగా అనిపిస్తున్నాయని అన్నారు.
జో బైడెన్ అంతకు ముందు అనేకమార్లు శ్వేతసౌధానికి వచ్చినా.. అక్కడి కార్యాలయాలను తప్ప నివాస భవనాలకు ఎప్పుడు దర్శించలేదట. అయితే ఇక్కడి నివాస భవనం కొత్తగా అనిపిస్తోంది.. కానీ.. అధ్యక్ష కార్యాలయం, అక్కడి బాధ్యతలకు తాను చక్కగా అలవాటు పడిపోయానంటూ వ్యాఖ్యానించారు. తాను మాట్లాడిన పలువురు మాజీ అధ్యక్షుల మాదిరిగానే తనకు కూడా వైట్ హౌస్ నాకు బంగారం పంజరంలాగా అనిపిస్తోందని అని అన్నారు. అయితే ఒక్కరుతప్ప పలువురు మాజీ అధ్యక్షులతో ఫోన్‌లో మాట్లాడినట్లు చెప్పిన జో బైడెన్.. ఆయన ఎవరో చెప్పడానికి నిరాకరించారు.