బల పరీక్షలో నెగ్గిన బీహార్ సీఎం నితీశ్ కుమార్

బీహార్ సీఎం నితీశ్‌ కుమార్‌ రాష్ట్ర అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకున్నారు.

By Srikanth Gundamalla  Published on  12 Feb 2024 4:39 PM IST
bihar, cm nitish kumar, won,  floor test,

 బల పరీక్షలో నెగ్గిన బీహార్ సీఎం నితీశ్ కుమార్ 

బీహార్ సీఎం నితీశ్‌ కుమార్‌ రాష్ట్ర అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకున్నారు. సోమవారం నిర్వహించిన విశ్వాస పరీక్షలో బీహార్ సీఎం నితీశ్ కుమార్ నెగ్గారు. ఆయనకు మొత్తం 129 మంది ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించారు. తద్వారా విశ్వాస పరీక్ష వీగిపోయింది. బల పరీక్షలో నితీశ్‌ కుమార్ నెగ్గడంతో విపక్ష పార్టీ సభ్యులు అసెంబ్లీ నుంచి వాకౌట్‌ చేశారు. కాగా.. బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 సభ్యులు ఉన్నారు. ప్రభుత్వం నిలబడాలంటే కావాల్సిన మెజార్టీ 122 సభ్యుల మద్దతు. ఇక నితీశ్‌ కుమార్‌కు 129 సభ్యులు మద్దతు తెలపడంతో విశ్వాస పరీక్షలో గెలిచారు.

కాగా.. అంతకుముందు ఆర్జేడీకి చెందిన స్పీకర్ అవధ్‌ బిహారీ చౌధరీపై ప్రవేశపెట్ఇన అవిశ్వాస తీర్మానం కూడా 125-112 ఓట్లతో నెగ్గింది. ఆ సమయంలో ఆర్జేడీకి చెందినముగ్గురు ఎమ్మెల్యేలు ఎన్డీయే పక్షం వైపు కూర్చోవడంతో తేజస్వీ అభ్యంతరం వ్యక్తం చేశారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్‌ను లేవనెత్తగా.. డిప్యూటీ స్పీకర్‌ మశ్వర్‌ హజారీ తిరస్కరించారు. త్వరలోనే బీహార్ అసెంబ్లీకి కొత్త స్పీకర్‌ను ఎన్నుకునే అవకాశాలు ఉన్నాయి.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్... నితీశ్‌ కుమార్‌ను తాను ఎప్పుడూ తండ్రిలాగే భావించానని చెప్పారు. మహాగఠ్‌బంధన్‌ నుంచి వైదొలిగి ఎన్డీఏలోకి తిరిగి వెళ్లేందుకు ఏ కారణాలు బలవంతం చేశాయో తెలియదని చెప్పారు. అసెంబ్లీలో మాట్లాడుతూ.. బీహార్‌లోని మహాకూటమి ప్రభుత్వాన్ని చూసి బీజేపీ భయపడిందనీ అన్నారు. దాంతో.. నితీశ్‌ మరోసారి కూటమి మారబోరని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇవ్వగలరా అంటూ తేజస్వీ యాదవ్ ప్రశ్నించారు.

జనవరి 28న నితీశ్‌ కుమార్‌ సీఎం పదవికి రాజీనామా చేశారు. తద్వారా ఆర్జేడీతో కలిసి ఆయన ఏర్పాటు చేసిన మహాకూటమి ప్రభుత్వం కూలింది. ఆ తర్వాత బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రిగా తొమ్మిదో సారి ప్రమాణం చేశారు. ఇక విపక్షం ప్రవేశపెట్టిన విశ్వాస పరీక్షలో నెగ్గి ప్రభుత్వాన్ని కొనసాగించేందుకు మార్గం సుగమం చేసుకున్నారు బీహార్ సీఎం నితీశ్ కుమార్ .

Next Story