కరోనా మహమ్మారి కారణంగా పాఠశాలలు మూతపడగా.. కేవలం ఆన్‌లైన్ క్లాసులు మాత్రమే నడుస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే చాలా రాష్ట్రాల్లో పాఠశాలలను తెరుస్తున్నారు. ఇక తమిళనాడులో పాఠశాలను ఇంకా తెరవలేదు. ఈ నేపథ్యంలో ఆరో తరగతి చదువుతున్న ప్రజ్ఞా అనే చిన్నారి ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ఓ లేఖ రాసింది. ఆ లేఖలో పాఠశాలలు ఎప్పుడు ప్రారంభం అవుతాయో తనకు చెప్పాలని కోరింది. తన మొబైల్ నంబర్‌ను సైతం ఆ లేఖలో రాసింది.
ఇక ఈ లేఖ చూసిన సీఎం స్టాలిన్.. స్వయంగా విద్యార్థిని ప్రజ్ఞాకు ఫోన్ చేసి మాట్లాడారు. నవంబర్ 1 తేదీ నుంచి పాఠశాలలను పునఃప్రారంభించనున్నట్లు వెల్లడించారు. కరోనా నియమాలు పాటిస్తూ.. మీ టీచర్ చెప్పే సూచనలను పరిగణలోకి తీసుకొని మాస్క్ ధరించి సామాజిక దూరం పాటిస్తూ పాఠశాలకు వెళ్లాలని సీఎం ప్రజ్ఞాకు సూచించారు. తనకు సీఎం స్టాలిన్ ఫోన్ చేసి మాట్లాడిన విషయాన్ని తాను ఇంకా నమ్మలేకపోతున్నానని చిన్నారి ప్రజ్ఞా తెలిపింది. ఇక కరోనా కారణంగా దాదాపు ఏడాదిన్నర కాలంగా మూతపడిన తమిళనాడు రాష్ట్రంలోని పాఠశాలలు నవంబర్ 1న పునః ప్రారంభం కాబోతున్నాయి.